New Delhi, May 18: దేశంలో కోవిడ్-19 తీవ్రత తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడగించింది. Lockdown 4.0 మే 18 నుండి అమల్లోకి రావడంతో రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్ల వర్గీకరణకు సంబంధించి పూర్తి అధికారాలను దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత పరిపాలన విభాగాలకే కట్టబెట్టింది.
ఇక లాక్డౌన్ 4 సమయంలో తీసుకోవలసిన చర్యలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. నేటి నుంచే ఇవి అమల్లోకి రానున్నాయి. దేశంలో అమలు చేయాల్సిన మార్గదర్శకాల జాబితాను కేంద్రం ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకు మరియు యూటీలకు చేరవేసింది. మే 18, సోమవారం నుండి మే 31 వరకు నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.
నూతన మార్గదర్శకాల ప్రకారం వాటికి అనుమతి ఉంది, వేటిపై నిషేధం కొనసాగుతుందో వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
వీటికి అనుమతి లేదు, యధావిధిగా నిషేధాజ్ఞలు కొనసాగుతాయి
- అన్ని రకాల దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నిషేధం. అయితే దేశీయంగా వైద్యసేవలు, డొమెస్టిక్ ఎయిర్ అంబులెన్స్, భద్రతా ప్రయోజనాల కోసం హోంశాఖ ద్వారా అనుమతి ఇవ్వబడుతుంది.
- మెట్రో, రైలు సర్వీసులు నిలిపి వేయబడతాయి
- అత్యవసరమైన వాటికి మినహా దేశవ్యాప్తంగా రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ప్రజల కదలికలు నిషేధించబడతాయి. కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుంది.
- పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు మూసివేయబడతాయి. ఆన్‌లైన్ అభ్యాసం అనుమతించబడుతుంది.
- హోటల్, రెస్టారెంట్లు, జిమ్‌లు, ఈత కొలనులు మూసివేయబడతాయి
- అన్ని సామాజిక / రాజకీయ / క్రీడలు / వినోద సమావేశాలు నిషేధించబడ్డాయి
- ప్రార్థన మందిరాలు, మత పరమైన ప్రదేశాలు మూసివేయబడతాయి
- అన్ని సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, వ్యాయామశాలలు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు, బార్‌లు మరియు ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్‌లు మరియు ఇలాంటి ప్రదేశాలు మే 31 వరకు దేశవ్యాప్తంగా మూసివేయబడతాయి.
- క్రీడా సముదాయాలు మరియు స్టేడియాలను తెరవడానికి అనుమతి ఇవ్వబడుతుంది; అయితే, ప్రేక్షకులను అనుమతించరు.
- 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, సహ-అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, అవసరమైన మరియు ఆరోగ్య ప్రయోజనాల మినహా మే 31 వరకు ఇంట్లో ఉంటారు.
అనుమతించబడేవి.. ఇవీ!
- కంటైన్మెంట్ మరియు రెడ్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో వాహనాలు తిరగవచ్చు. ఇరుగు-పొరుగు రాష్ట్రాలు మరియు యూటీల పరస్పర అంగీకారంతో బస్సులు మరియు ప్రయాణీకుల వాహనాలకు అంతరాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఉంటుంది.
- నిబంధనల మేరకు వ్యక్తుల ప్రయాణాల కోసం వివిధ రవాణా మార్గాలు ఇప్పటికే తెరవబడ్డాయి. అనుమతి ఉన్నవారికి ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వీలు ఇదివరకే కల్పించింది.
- భారత్ నుంచి విదేశీ పౌరులను తరలించడం, విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను ఇండియాకు రప్పించడం, భారతీయ నౌకాదళాల సైన్-ఆన్ మరియు సైన్-ఆఫ్ కొనసాగుతుంది.
- డాక్టర్లు, వైద్య నిపుణులు, నర్సులు మరియు పారా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది మరియు అంబులెన్స్‌లకు రాష్ట్రం లోపల మరియు రాష్ట్రం దాటి ప్రయాణించేందుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అన్ని రాష్ట్రాలు మరియు యూటీలు అనుమతించాలి.
- అన్ని రకాల వస్తువులు, సరుకు రవాణాకు సంబంధించి ఖాళీ ట్రక్కులతో సహా అంతర్-రాష్ట్ర ప్రయాణాలకు అన్ని రాష్ట్రాలు మరియు యూటీలు ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతించాలి.
అన్ని కార్యాలయాలు మరియు పనిచేసే ప్రదేశాలలో ఉద్యోగుల ఆరోగ్యం మరియు భద్రత దృష్ట్యా 'ఆరోగ్య సేతు' అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రతీ ఒక్కరు తమ ఫోన్లలో ఆరోగ్య సేతును ఇన్‌స్టాల్ చేసుకొని ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థుతులను నమోదు చేసేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా కరోనా లక్షణాలతో అనారోగ్యం పాలైతే వెంటనే వారికి వైద్య సదుపాయం అందించాలని కేంద్రం సూచించింది.