Image used for representational purpose (Photo Credits: Pixabay)

Visakhapatnam, April 15:  విశాఖపట్నం జిల్లాలోని రెండు ఘటనలు స్థానికంగా ప్రజలను ఉలిక్కి పడేలా చేశాయి. పెందుర్తి మండలంలోని జుత్తాడలో జరిగిన దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు. నిందితుడిని అప్పలరాజుగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఆ కుటుంబాన్ని అంతం చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పలరాజుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

గత కొంతకాలంగా నిందితుడికి సదరు బాధిత కుటుంబంతో ఆస్తి తగాదాలు  ఉన్నట్లు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆ ఇంట్లోకి చొరబడిన అప్పలరాజు చిన్న,పెద్ద అని తేడా లేకుండా మొత్తం కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. పదునైన ఆయుధంతో మనుషులను తెగనరుకుతూ నరమేధం సృష్టించాడు. మృతుల్లో బొమ్మిడి రమణ (63), ఉషారాణి (35), అల్లు రమ (53), నక్కెళ్ల అరుణ (37)తో పాటు ఉషారాణి పిల్లలైన 2 ఏళ్ల ఉదయ్, 6 నెలల ఉర్విష కూశా ఉన్నారు.

అయితే, అప్పలరాజు కూతురు అత్యాచారానికి గురైందని, దానికి ప్రతీకారంగానే ఆ రేపిస్ట్ కుటుంబాన్ని నిందితుడు హత్య చేసినట్లు ఏఎన్ఐ అనే వార్తా ఏజేన్సీ నివేదించింది. అయితే దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.

Here's ANI's Report: 

ఇదిలా ఉంటే, మధురవాడలోని ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్ ఫ్లాట్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బహ్రెయిన్ దేశంలో పనిచేసే బంగారు నాయుడు అనే వ్యక్తి గత ఎనిమిది నెలల క్రితమే కుటుంబంతో సహా విశాఖ వచ్చి స్థానిక ఫార్చ్యూన్ టవర్స్ లోని 505 ఫ్లాట్‌లోని అద్దెకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి దాటాకా ఆ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగటంతో బంగారు నాయుడు సహా అతడి భార్య, ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు. అయితే ఘటనాస్థలంలో రక్తపు మరకలు ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఎవరైనా ఈ కుటుంబాన్ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఒకేరోజు విశాఖ జిల్లాలో జరిగిన 2 ఘటనలతో మొత్తం 10 మంది చనిపోవడం సంచలనం సృష్టిస్తోంది. ఈ రెండు ఘటనలకు సంబంధించిన కారణాలు కూడా మిస్టరీగా మారాయి.