Allu Arjun and Telangana High court (Photo-X/ Wikimedia)

Hyd, Dec 13: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో ఆరెస్ట్‌ అయిన అల్లు అర్జున్‌కు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టులో వాదనలకు ముందు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ పరిస్థితుల మధ్య అల్లు అర్జున్‌పై నమోదైన కేసును కొట్టివేయాలని, సాధ్యంకాని పక్షంలో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం

ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్‌లు అల్లు అర్జున్‌కు వర్తించవని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అర్నాబ్‌ గోస్వామి కేసులో బాంబే కోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు కూడా నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని కోర్టు పేర్కొన్నది.

ఎవరేం వాదించారంటే..

పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ): క్వాష్ పిటిషన్‌పై విచారణ అత్యవసరం కాదని.. సోమవారం వినాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టును కోరారు. అల్లు అర్జున్ అరెస్టయినందున బెయిల్ కోసం అవసరమైతే మరో పిటిషన్ వేసుకోవాలన్నారు.మధ్యాహ్నం అడగ్గానే లంచ్ మోషన్‌కు అనుమతివ్వడం తప్పుడు సంకేతం ఇస్తుందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) కోర్టుకు తెలిపారు. క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్ ఇవ్వొచ్చా? లేదా? అనే అంశంపై వాదించాలని ఈ సందర్భంగా హైకోర్టు పీపీకి సూచించింది. థియేటర్‌కు వెళ్లొద్దని అల్లు అర్జున్‌కు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారని పీపీ కోర్టుకు తెలిపారు. భారీగా జనం ఉంటారని తెలిసినప్పటికీ అల్లు అర్జున్ వెళ్లారని వివరించారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని క్వాష్ పిటిషన్‌లో ఎక్కడా కోరలేదని పీపీ వాదనలు వినిపించారు. క్వాష్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ అవసరం లేదని, సోమవారం విచారించాలని కోరారు. అల్లు అర్జున్ భద్రత సిబ్బంది తోయడంతోనే తొక్కిసలాట (sandhya theatre incident) జరిగినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి భార్య మరణించింది. కుమారుడు వెంటిలేటర్‌పై ఉన్నాడని పీపీ కోర్టుకు వివరించారు. అందుకే అల్లు అర్జున్‌కు ఎలాంటి ఊరట ఇవ్వొద్దని పీపీ తన వాదనలు వినిపించారు.

అల్లు అర్జున్ తరపు న్యాయవాది : క్వాష్ పిటిషన్‌లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.అల్లు అర్జున్ తన ప్రతి సినిమా విడుదల రోజున థియేటర్‌కు వెళ్తారు. థియేటర్ యాజమాన్యం, నిర్మాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అల్లు అర్జున్ రాత్రి 9.40కి సంధ్య థియేటర్‌కు వెళ్లి మొదటి అంతస్తులో కూర్చున్నారు. తొక్కిసలాటలో మరణించిన మహిళ కింద అంతస్తులో ఉన్నారు’’ అని అల్లు అర్జున్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన భద్రత ఇవ్వలేదని అల్లు అర్జున్ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసులు కూడా భద్రత కన్నా అల్లు అర్జున్‌ను చూసేందుకే ఎక్కువ ఉత్సాహం చూపారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను పూర్తిగా కొట్టివేయాలని పిటిషన్‌ వేశాం. పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగానే అరెస్టు చేశారు. అందువల్ల ఈ పిటిషన్‌ ద్వారానే మధ్యంతర బెయిల్‌ ఇవ్వొచ్చని గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నందున మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరారు.

అర్ణబ్ గోస్వామి, మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించడంతో వాటి ఆధారంగా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్ కు రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్‌ను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును సంప్రదించాలని సూచించింది. క్వాష్‌ పిటిషన్‌లో మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంపై పీపీ అభ్యంతరం తెలపగా హైకోర్టు తోసిపుచ్చింది.