Amit Shah Discharged from AIIMS: ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయిన అమిత్ షా, ఆగస్టు 2న హోం మంత్రికి కరోనా పాజిటివ్, మళ్లీ ఒళ్లు నొప్పులు, నీర‌సంతో ఎయిమ్స్‌లో చేరిక
Union Home Minister Amit Shah | (Photo Credits: ANI)

New Delhi, August 31: గత కొన్ని వారాల నుంచి ఎయిమ్స్‌‌లో చికిత్స తీసుకుంటున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ (Amit Shah Discharged from AIIMS) అయ్యారు. కరోనాను జయించిన అనంతరం అనారోగ్య కారణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన ఆయన (Union Home Minister) ప్రస్తుతం కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఆగస్టు 2న అమిత్‌ షాకు కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైద్యుల సూచనలతో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన.. కరోనా నుంచి కోలుకుని ఆగస్ట్‌ 14న ఇంటికి వచ్చారు. అయితే ఒళ్లు నొప్పులు, నిస్సత్తువ తగ్గకపోవడంతో ఆగష్టు 18న అమిత్‌ షా ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో చేరారు. అత్యుత్తమ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది. ఈ క్రమంలో ఆయనను ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దేశంలో పెరుగుతున్న రికవరీ రేటు, ఇప్పటివరకు 27,74,802 మంది డిశ్చార్జ్, 7,81,975 యాక్టివ్‌ కేసులు, తాజాగా 78,512 మందికి కోవిడ్-19

ఈరోజు ఉద‌యం దేశ‌ప్ర‌జ‌ల‌కు ఓనం శుభాకాంక్ష‌లు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే గ‌త కొన్ని ‌వారాలుగా దేశవ్యాప్తంగా ముఖ్య‌మంత్రు‌లు, కేంద్ర‌మంత్రులు, మంత్రు‌లతో స‌హా, ఆయా పార్టీల‌కు చెందిన‌ అగ్ర‌నేత‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి ఖ‌ట్ట‌ర్‌, మధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌తో స‌హా అగ్ర‌నాయ‌కుల‌కు క‌రోనా సోకింది.

దేశ రాజధానిలో ఒక్కరోజే 2,024 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత నెల రోజులుగా అక్కడ ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షా డెబ్పై మూడు వేలు దాటింది. ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీలో 22 మంది కోవిడ్‌తో మరణించగా.. కరోనా మృతుల సంఖ్య మొత్తంగా 4,426కు చేరుకుంది.