Amaravati,Febuary 22 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడంలో ఆందోళన చేసినవారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. దీనికి నిరసనగా రాజధాని ప్రాంతంలో ఇవాళ బంద్‌కు చేపడుతున్నారు. 29 గ్రామాల్లో బంద్ (Amaravati Bandh) జరుగుతుందని జేఏసీ ప్రకటించింది. వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా వ్యాపార కార్యకలాపాలు తెరుచుకోని పరిస్థితి నెలకొంది.
అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు (Capital Farmers Protest) 67వ రోజుకు చేరుకున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయిపాలెం, రాయవుడి, నేలపాడు, పెదపరిమితాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది. మందడంలో జరుగుతున్న ఆందోళనలను పోలీసులు డ్రోన్లతో చిత్రీకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా డ్రోన్ వాడారని... తుళ్ళూరు డీఎస్పీ, సీఐపై స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం, గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు
కాగా మందడం వాసుల ఆరోపణలపై పోలీసులు స్పందించారు. డ్రోన్‌లో మహిళల్ని అసభ్యంగా చిత్రీకరించారనేది అబద్ధమని తుళ్లూరు డీఎస్పీ అన్నారు. కావాలనే కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని తెలిపారు. మందడంలో రాకపోకలకు అంతరాయం కలిగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి చెప్పారు.
ఇదిలా ఉంటే మందడం రైతులపై కేసులు పెట్టడాన్ని అమరావతి జేఏసీ తప్పుబట్టింది. ఇందులో భాగంగా నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.