Andhra Pradesh CM YS Jagan distributes cheques to Agrigold depositors (Photo-Twitter)

Amaravathi, November 8: గతంలో ఏపీ రాష్ట్రాన్ని అగ్రిగోల్డ్‌ స్కామ్ (AgriGold Scam) ఓ ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్‌ కంపెనీ చేసిన మోసం(AgriGold Chit Funds scam)తో దాదాపు 3.70 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులో ఇంకా కేసు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఎన్నికలకు ముందు సాగిన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అధికారంలోకి రాగానే డిపాజిట్‌ చేసి నష్టపోయిన వారికి అండగా ఉంటానని తెలిపారు.

ఇందులో భాగంగా తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్‌ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేశారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్‌దారులకు డబ్బులు అందజేస్తామన్నారు. గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ అగ్రిగోల్డ్‌ బాధితుల(Agrigold Victims) కు డిపాజిట్‌ చెక్కులను అందజేశారు.

ఏపీ సీఎంఓ ట్వీట్ 

అయితే ఈ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలో ఉంది. సంస్థ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఒక్కో ముడి విప్పుతూ కోర్టు అనుమతితో ఇప్పుడు 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ.264 కోట్లు ఇచ్చినట్లుగా జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన వారందరికీ మేలు చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు.

పేర్లు నమోదు చేసుకోకుంటే ఇలా నమోదు చేసుకోండి

అర్హులైన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే వారికి మరో నెల రోజులు గడువు ఇచ్చారు. వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ దానిపై అవగాహన లేకపోతే కలెక్టరేట్‌లు, ఎమ్మార్వో కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు వెళ్లండి. అక్కడ నమోదు చేసే అవకాశం కల్పిస్తారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ సంధర్భంగా ఆయన పలు విషయాలను గుర్తు చేసుకున్నారు.

తొలి అడుగు వేశానన్న ముఖ్యమంత్రి

పాదయాత్రలో ప్రతి ఊళ్లో అగ్రిగోల్డ్‌ బాధితులు చెప్పిన కష్టాలు విన్నానని, నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తొలి అడుగు వేశానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్నగా తోడుంటానని భరోసా ఇచ్చారు. న్యాయం చేస్తానని ఆ రోజు ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్‌ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్‌దారులకు డబ్బులు అందజేస్తామన్నారు.

మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున పోరాటం చేశాం. మే 30న మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు అండగా నిలుస్తూ జూన్‌ 10న తొలి కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేశాం. జూలై 12న తొలి బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. అధికారం చేపట్టిన కేవలం ఐదు నెలల్లోనే బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేశాం. అక్షరాలా 3.70 లక్షల మందికి రూ.264 కోట్లు ఇవ్వగలుతున్నందుకు ఆనందంగా ఉంది. అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఇచ్చిన హామీ అమలు నిలబెట్టుకున్నాం

సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు నడుపుకునే డ్రైవర్లకు ఇచ్చిన హామీ అమలు చేస్తూ 1.75 లక్షల మందికి ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తూ తొలి అడుగులు వేశాం. అర్హత ఉండీ లబ్ధిపొందని వారి కోసం ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఫలితంగా మరో 50 వేల మందికి లబ్ధి కలుగనుంది. మొత్తం 2.25 లక్షల మంది ఆటో నడుపుతున్న సోదరులకు అండగా నిలవగలిగాం అని అన్నారు.

రైతన్నల మోములో చిరునవ్వు

నేను విన్నాను.. నేను ఉన్నానని ప్రతి రైతన్నకు మాటిచ్చిన విధంగా నేను చెప్పిన దానికన్నా మిన్నగా నేడు రైతు భరోసా అమలు చేస్తున్నాం. నాలుగేళ్లు ఇస్తామని చెప్పి ఈ రోజు ఐదేళ్లు ఇస్తున్నాం. ఆ రోజు రూ.12,500 చెబితే, ఈ రోజు 13,500 ఇస్తున్నాం. 46 లక్షల రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసాను ఐదు నెలల్లోనే అమలు చేయగలిగాం. ఈ విషయంపై ఎంతో గర్విస్తున్నామని అన్నారు.

అవ్వతాతలకు పింఛన్ పెంచాం

గత ఐదేళ్లలో అవ్వతాతలకు గత ప్రభుత్వం సగటున నెలకు రూ.500 కోట్లు ఇస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.1,300 కోట్లు ఇస్తోంది. ఈ విధంగా గత ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా అవ్వాతాతల పింఛన్ల బడ్జెట్‌ మొత్తాన్ని మీ బిడ్డ పెంచాడని తెలియజేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు.

జగన్ స్పీచ్ హైలెట్స్

1. ఏ రాష్ట్రంలో జరగని విధంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదేనని జగన్ తెలిపారు.

2. దేశంలోనే తొలిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేషన్‌పై ఇచ్చే పనుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో, దేవాలయాల బోర్డుల్లో (టీటీడీ మినహా) 50 శాతం రిజర్వేషన్‌ కల్పించామన్నారు.

3. చదువుకుని ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్న పిల్లలకు నాలుగు లక్షల ఉద్యోగాలు అందించామని తెలిపారు.

4. కంటి వెలుగు పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాం. వారిలో దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదా చేశాం

ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సొమ్ము ఆదా అయ్యేలా గడిచిన ఐదు నెలల్లోనే పలు చర్యలు చేపట్టాం. మొట్టమొదటిసారిగా జ్యుడిషియల్ కమిషన్‌ను తీసుకొచ్చాం. దేశచరిత్రలో ఎక్కడా జరగని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ విధానం ద్వారా ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే దాదాపు రూ.830 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేశాం. వెలిగొండ ప్రాజెక్టులో దాదాపు రూ.50 కోట్లు మిగిల్చాం. కేవలం ఈ 5 నెలల్లోనే దాదాపు రూ.1,000 కోట్ల పైచిలుకు ప్రజాధనం ఆదా చేయగలిగాం. దీన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ఇది ఎంతో గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు.