COVID 19 Outbreak in India | PTI Photo

Nellore, March 11:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు (COVID 19 in AP) బుధవారం నమోదైంది. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి నెల్లూరు  వచ్చిన యువకుడికి కరోనావైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది.  బాధితుడు గత నాలుగు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతడికి రక్త నమూనాలు పరీక్షించగా కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. క్రాస్ చెక్ కోసం బాధితుడి రక్త నమూనాలను పుణెలోని వైరస్ నిర్ధారణ కేంద్రానికి పంపించారు. అక్కడ కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

ప్రస్తుతం పేషెంట్ ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. పేషెంట్ కుటుంబ సభ్యుల రక్తనమూనాలను సేకరించి వైరస్ నిర్ధారణకు పంపారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ యువకుడు నివసించే స్థానిక చిన్నబజారు ప్రాంతంలోని వాసులను అప్రమత్తం చేశారు.

స్టేట్ హెల్త్ కంట్రోల్ రూం తెలిపిన వివరాల ప్రకారం గత నెల ఫిబ్రవరి 29 నుంచి ఇప్పటివరకు ఇటలీ దేశంలో పర్యటించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన 75 మంది ప్రయాణికులను గృహ నిర్భంధంలో ఉంచారు. ఇటీవల కాలంలో విదేశీ పర్యటనలు చేసి ఆంధ్రా వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపించిన 35 మందికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే అందులో 33 మందికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని, మిగతా ఇద్దరిలో ఒకరికి నేడు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, మరొకరి రిపోర్ట్ రావాల్సి ఉంది.  కరోనాప్రభావిత దేశాల నుంచి ఏపికి వచ్చిన 465 మందిని అబ్జర్వేషన్ పీడియడ్‌లో ఉంచిన అధికారులు

ఇదిలా ఉండగా ఇటలీ (Italy)  దేశంలో కరోనావైరస్ విజృంభిస్తుంది. ఇటలీలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. కరోనావైరస్ బారినపడి ఇప్పటివరకు ఇటలీలో మరణించిన వారి సంఖ్య 630 దాటింది. ఎవ్వరూ కూడా బయటికి రావొద్దు, అందరూ గృహ నిర్భంధంలో ఉండాలని ఇటలీ వాసులకు అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇటు భారత్ కూడా ఇటలీ మరియు దక్షిణ కొరియా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.

ఈ నేపథ్యంలో వందల మంది ఆంధ్రా మరియు తెలంగాణకు చెందిన విద్యార్థులు ఇటలీలో చిక్కుకున్నారు. వీరంతా పడోవా, రిమిని, మోడెనా, మిలన్ వంటి ప్రదేశాలలో ఉన్నారు - ఈ ప్రాంతాలన్నీ కరోనావైరస్ రెడ్ జోన్లుగా ప్రకటించబడ్డాయి. వీరి పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అయితే ఇటలీలో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎయిర్ ఇండియా విమానాల ద్వారా కొంత మంది భారతీయులను ఇటలీలోని మిలన్ నుంచి దిల్లీ మరియు కోచికి తీసుకువస్తున్నారు. వీరందరికీ విమానాశ్రయాలలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటివరకు కరోనావైరస్ 100 దేశాలకు విస్తరించింది, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1 లక్షా 20 వేల మందికి కరోనావైరస్ సోకింది. వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 4 వేలకు చేరింది.