Mumbai, April 5: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.ముంబై మాజీ కమీషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల కేసులో.. హోంమంత్రి దేశ్‌ముఖ్‌పై 15 రోజుల్లోగా సీబీఐ విచారణ పూర్తి చేయాలని ఇవాళ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా (Anil Deshmukh Resigns As Maharashtra Home Minister) చేశారు. రాజీనామా లేఖను ఆయన సీఎం ఉద్దవ్ ఠాక్రేకు అందజేశారు. అయితే ఆ రాజీనామా లేఖను సీఎం ఆమోదించాల్సి ఉందని మరో మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు.
హోంమంత్రిపై తాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఫిర్యాదు చేసిన కారణంగానే తనను బదిలీ చేశారని పరమ్ బీర్ (Param Bir Singh) ఆరోపించారు. పోలీసు అధికారులకు నెలకు రూ.100 కోట్ల వసూళ్ల లక్ష్యం విధించారని, అక్రమ బదిలీలు చేశారని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్ బీర్ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ పిటిషన్ మేరకు బోంబే హైకోర్టు మంత్రి దేశ్‌ముఖపై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తూ అనిల్ దేశ్‌ముఖ్ నిర్ణయం తీసుకున్నారు.
అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా విషయంపై ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్ మీడియాతో మాట్లాడుతూ... 'హైకోర్టు (Bombay High Court) నుంచి సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చిన అనంతరం మా పార్టీ చీఫ్ శరద్ పవార్‌తో పాటు పార్టీలోని పలువురు నేతలను అనిల్ దేశ్ ముఖ్ కలిశారు. విచారణ నేపథ్యంలో హోంమంత్రి పదవిలో కొనసాగబోనని చెప్పారు. అనంతరం సీఎంను కలిసి, రాజీనామా లేఖ ఇవ్వడానికి వెళ్లారు. ఆయన రాజీనామాను ఆమోదించాలని మా పార్టీ కూడా సీఎంను కోరింది' అని చెప్పారు. కాగా, ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంకా ఆమోదించలేదు.
పోలీసు అధికారులకు నెలకు రూ.100 కోట్ల వసూళ్ల లక్ష్యం విధించారని, అక్రమ బదిలీలు చేశారని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరమ్ బీర్ ఆరోపణలు గుప్పించారు. గత విచారణలో ఈ ఆరోపణలపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ బాంబే హైకోర్టు ఆయనను పదే పదే ప్రశ్నించింది. కేసులో హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నారని చట్టాలను పక్కన పెడతారా అని ప్రశ్నించారు. ప్రధాని జోక్యం ఉంటే ఎవరు విచారణ జరుపుతారు? బయటి నుంచి అతీత శక్తులు ఏవైనా వస్తాయా అని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
పరంబీర్ ఆరోపణలపై ఇక సీబీఐ విచారణ చేపడుతుందని, ఇక ఇప్పుడు ఆయన మంత్రి పదవిలో ఉండడం సరికాదు అని ఎన్సీపీకి చెందిన నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కోర్టు ఆదేశాలపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని పరంబీర్ సింగ్ తెలిపారు.