Vjy, Nov 6: ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆమోదం చెప్పింది. మంత్రి వర్గం తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ పాలసీ తీసుకొచ్చారు.
డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. డ్రోన్ రంగంలో పరిశోధన చేసే విద్యా సంస్థలకు రూ.20 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిందన్నారు. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లును అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. 25 వేల మందికి డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తామన్నారు. 50 డ్రోన్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.
ఎక్సైజ్ చట్ట సవరణ ముసాయిదాకు, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ లక్ష్యాల సాధనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం.సీఆర్డీఏ పరిధిని 8,352 చదరపు కిలోమీటర్లకు పెంచుతూ ఆమోదం.సీఆర్డీఏ పరిధిలోకి పల్నాడు, బాపట్ల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నుంచి 154 గ్రామాలు.11 మండలాల్లోని 154 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి తెస్తూ ఆమోదం.జ్యుడిషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంచుతూ ఆమోదం.2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీనీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపైనా సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిగా ప్రస్తావించినట్లు తెలిసింది. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా, కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నట్లు సమాచారం.
జగన్ ప్రభుత్వంలో క్రియాశీలంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశం చర్చకు వచ్చింది. కొంతమంది అధికారుల తీరువల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్లకు సరిగా స్పందించడం లేదని తెలిసింది. కింది స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి.. తప్పించుకుంటున్నారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు.
ఈ సమయంలో కలగజేసుకున్న పవన్ కల్యాణ్.. తానూ అందుకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం నుంచే పోలీసులు ఇలా తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడిన పెడదామని సీఎం స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదన్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైకాపా సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు వదిలేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. కడప తాలూకా పోలీసులు బుధవారం తెల్లవారుజామున రవీంద్రారెడ్డికి 41-ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు, డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కడపలోని ఎస్పీ కార్యాలయానికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేరుకుని ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో సమావేశమయ్యారు. వర్రా రవీంద్రారెడ్డి కేసుపై ఆయన ఆరా తీశారు.
వర్రా రవీంద్రారెడ్డిని వదిలేయడంపై పోలీసుల మీద సీఎం, డీజీపీ ఆగ్రహం
వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు వదిలేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా వర్రా రవీంద్రారెడ్డి అడ్డూ అదుపూ లేకుండా మితిమీరి ప్రవర్తించారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్, వంగలపూడి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఆయనపై మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులున్నాయి. ఈ క్రమంలో మంగళవారం పులివెందులలో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కడపకు తీసుకొచ్చి రహస్యంగా విచారించారు. అనంతరం బుధవారం 41-ఏ నోటీసు ఇచ్చి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలంటూ వదిలిపెట్టారు. మరో కేసులో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు మళ్లీ వెళ్లగా వర్రా రవీంద్రారెడ్డి తప్పించుకున్నారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. రవీంద్ర ఆచూకీ కోసం బుధవారం కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకుని చింతకొమ్మదిన్నె పీఎస్‌లో విచారిస్తున్నారు.