One Rupee Registrstion: రూపాయికే 2 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్, పేదలకు బంపరాఫర్ ఇచ్చిన జగన్ సర్కారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు, మంత్రులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష
AP-CM-ys-jagan-mohan-reddy-approved-1-rupee-registrstion ( Photo-Twitter)

Amaravathi, October 18: పరిపాలనలో ఏపీ సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ తాజాగా పేదల కోసం మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. రెండు సెంట్లలోపు స్థలాన్ని మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని, వీటి క్రమబద్ధీకరణకు విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయమై ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

రాష్ట్రంలో నదీతీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్‌ చేసే వారు కాదని ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కన్నా ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు.

ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గా లేదని ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని, దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని తెలిపారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే లబ్ధిదారుల జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి.. ఎలా చేయాలి.. ఎవరిని సంప్రదించాలి వంటి సూచనలు కూడా ఇవ్వాలని సీఎం చెప్పారు.ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.

లబ్ధిదారులు సంఖ్య 20,47,325

ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించామని, ఇక్కడ మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందని, అలాగే, పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు.