Amaravathi,Septemebr 27: ఏపీ సీఎం వైయస్ జగన్ పాలనలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పరిపాలనలో తనదైన మార్క్ ని చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొద్ది పాటి వర్షానికే దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా వైయస్ జగన్ ఫోకస్ పెట్టారు. వర్షాకాలంలో నగర ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదని అధికారులకు సూచించారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా ఉన్న నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని, పైగా వాటికి చట్టబద్ధత ఉండదని ఎప్పటికీ పట్టా కూడా రాదని చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నదీ పరీవాహక ప్రాంతాలకు భంగం కలగకుండా చూడాలన్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సుదీర్ఘ చర్చలు
నగరాలు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థాల తొలగింపు, మురుగునీటి శుద్ధి, పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. వీటి కోసం కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతి మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉండాలని. అలాగే మురుగునీటి శుద్ధి ఉండాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడం లేదని వీటిపైసత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రధానంగా తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాలపై దృష్టిపెట్టాలని తెలిపారు. వీటిపై ఏ సమస్య వచ్చినా.. వెంటనే తక్షణమే పరిష్కారం అయ్యేవిధంగా ఉండాలన్నారు.
తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలు చేయడంపై చర్చ
ఈ రివ్యూ మీటింగ్‌లో భాగంగా తాడేపల్లి, మంగళగిరిలను మోడల్ మున్సిపాలిటీలుగా రూపొందించడంపై చర్చ జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధి కోసం ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు గృహాలు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలో కనీసం 15 వేల ఇళ్లు ఇవ్వాలన్నారు. నిర్మించే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలిక సదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని, తాడేపల్లి మున్సిపాలిటీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు వైయస్ జగన్.
లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండకూడదు
ఇళ్ల నిర్మాణం కింద ప్రస్తుతం ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్లు విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కోరుకున్న ప్రాంతంలోనే ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని, ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘ కాలంగా ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. దీంతో పాటుగా బకింగ్ హాం కెనాల్ కాలుష్యం కాకుండా చూడాలని.. కాల్వ గట్లపై మొక్కలను విస్తారంగా పెంచాలన్నారు. మున్సిపల్ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా నియంత్రించాలని ఏ పౌరుడు, బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.