Mumbai, NOV 15: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం (Maharashtra Elections) హోరెత్తుతోంది. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు. ఇప్పటికే ప్రచారాలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించిన అక్కడి నేతలు.. ఇతర రాష్ట్రాల నేతలతోనూ మరింత ప్రచారం చేయిస్తున్నారు. ఏ చిన్న అవకాశం మిస్ అవకుండా ఇతర నేతలతో తమ పార్టీ అభ్యర్థుల కోసం క్యాంపెయిన్ చేయించుకుంటున్నారు. మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేపు మహారాష్ట్రకు వెళ్లనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) రేపటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రేపటి నుంచి బరిలోకి దిగనున్నారు. మూడు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఎన్డీయే తరుపున చంద్రబాబు, ఎంవీఏ తరుపున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపును ఎన్డీయే కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంతో ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇందులో భాగంగా తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబుతో విస్తృతంగా ప్రచారం చేయించాలని భావిస్తోంది. దీంతో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
ఇక సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) సైతం ఎంవీయే కూటమి తరుపున మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఎంవీయే కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా క్యాంపెయిన్ చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించనున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న పథకాలు, ప్రభుత్వ తీరును వివరించి.. ఎంవీయే కూటమిని ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కోరనున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగ్స్ లోనూ రేవంత్ పాల్గొననున్నారు. ఎన్డీయే కూటమి తరుపున చంద్రబాబు, ఎంవీయే కూటమి తరుపున రేవంత్ ప్రచారంతో.. ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో పరస్పర వ్యతిరేక పార్టీలకు ప్రచారం చేసినట్లు అవుతుంది.
మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండటంతో.. ఏ చిన్న అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా పార్టీలు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి.