New Delhi, July 20: దేశంలో కరోనా మహమ్మారి రూపు మార్చుకుంటూ.. మరింత శక్తిమంతంగా తయారవుతూ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. మన దేశంలో ఇంకా ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో కొత్త వార్త బయటకు వచ్చింది. దేశంలోనే తొలిసారి ఓ మహిళా వైద్యురాలు ఒకేసారి కోవిడ్ రెండు వేరియంట్ల (Two Covid Variants) బారిన పడ్డారు. సదరు వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా వైరస్ తో పాటు ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ బారిన పడ్డట్లు తెలిసింది.
హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. అసోంలోని దిబ్రుగఢ్ జిల్లా, లాహోవాల్‌లోని ఐసీఎంఆర్ రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్‌ఎంఆర్‌సి) నోడల్ ఆఫీసర్ డాక్టర్ బిస్వాజ్యోతి బోర్కాకోటి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బిస్వాజ్యోతి మాట్లాడుతూ.. ‘‘తాజాగా కోవిడ్ బారిన పడ్డ ఓ మహిళా డాక్టర్‌లో మేం ఒకేసారి కరోనా రెండు వేరియంట్లను (Assam doctor infected with two Covid variants) గుర్తించాము. ఇప్పటికే ఆమె రెండు డోసుల టీకా తీసుకున్నారు. అయినప్పటికి వైరస్ బారిన పడ్డారు’’ అని తెలిపారు.
బిస్వాజ్యోతి మాట్లాడుతూ.. ‘‘మేం బాధిత వైద్యురాలి శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షించాం. ఈ క్రమంలో ఆమెకు ఒకేసారి కోవిడ్ వైరస్‌కు చెందిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకాయి.ఒకే వ్యక్తిపై వైరస్ రెండు వేరియంట్లు ఒకేసారి దాడి చేయడం దేశంలో ఇదే ప్రథమం. మొదట మేం ఈ విషయాన్ని నమ్మలేకపోయాం. మా అనుమాన నివృత్తి కోసం మరోసారి ఆమె శాంపిల్స్ పరీక్షించాం. అప్పుడు కూడా సేమ్ అదే ఫలితం వచ్చింది. ఇక ఆమె భర్తకు ఆల్ఫావేరియంట్ సోకింది’’ అని తెలిపారు.
ప్రస్తుతం వైద్యురాలిలో కోవిడ్ లక్షణాలు తీవ్రంగా లేవని.. అందువల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. కొద్ది రోజుల క్రితం బెల్జియానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్ల బారిన పడిన సంగతి తెలిసిందే. కాకపోతే అప్పటికి సదరు వృద్ధురాలు వ్యాక్సిన్ తీసుకోలేదు. ఈ క్రమంలో ఆమె మార్చి, 2021న మృతి చెందారు.