Hyderabad, October 03: పండగ సీజన్ లో ఉండే డిమాండ్ దృష్ట్యా సాధారణ ఖాతాదారులకు మరియు చిన్న, మధ్యస్థ స్థాయి సంస్థలకు (MSME) అలాగే రిటైల్ వ్యాపారస్తులకు రుణాలు అందివ్వడం కోసం నేటి నుంచి మొదటి దశ 'లోన్ మేళా' (Loan Mela) ను వివిధ బ్యాంకులు ప్రారంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఈ లోన్ మేళా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. అక్టోబర్ 03 నుంచి నాలుగు రోజుల పాటు ఈ లోన్ మేళా కొనసాగనుంది.
ఈ నాలుగు రోజులలో, రిటైల్, వ్యవసాయం, వాహనం, ఇల్లు, ఎంఎస్ఎంఇ, విద్య మరియు వ్యక్తిగత అవసరాల కోసం అక్కడికక్కడే రుణాలు మంజూరు చేయబడతాయి. ఈ లోన్ మేళా శిబిరాలు ఖాతాదారులకు మరియు చిన్న, మధ్యస్థ సంస్థలకు, రిటైలర్స్ కు ఆటో, హోమ్, పర్సనల్ మరియు బిజినెస్ విభాగంలో రుణాలు పొందటానికి మరియు బ్యాంక్ సేవలకు సంబంధించి ఇతర అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అక్టోబర్ నెలలో 11 రోజులు బ్యాంకులు పనిచేయవు
పండుగ సీజన్ డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), కార్పొరేషన్ బ్యాంక్ తదితర బ్యాంకులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి.
ఈనెల ప్రారంభంలో జరిగిన వార్షిక సమీక్షలో, 400 జిల్లాల్లో 'లోన్ మేళా' చేపట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. కాగా, ఇందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా తమ ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో మొదటి దశ లోన్ మేళా 250 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు, మిగతా 150 జిల్లాల్లో రెండో దశ లోన్ మేళా అక్టోబర్ 21 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు సమాచారం.