New Delhi, Oct 26: లోన్ తీసుకున్న కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు (Diwali Gift for Loan Customers) అందించింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో (moratorium period) ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నామని కేంద్రం తెలిపింది. మారటోరియం కాలంలో అన్ని రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీయే వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని సుప్రీంకోర్టుకు (Supreme Court) కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అవిడఫిట్‌లో పేర్కొన్న దిశగా చర్యలు చేపట్టిన విషయం విదితమే
కాగా బ్యాంకులు రుణగ‍్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయనుండగా, తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు రీఎంబర్స్ చేస్తుంది. మారటోరియం సమయంలో ఈఎంఐలపై చక్రవడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఈనెల 21న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
గృహ, విద్యా, ఆటో, వ్యక్తిగత, క్రెడిట్ కార్డు బకాయిలు, సూక్ష్మ, చిన్న, మధ్యశ్రేణి సంస్థల రుణాలకుగాను మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వాయిదాలకు ఇది వర్తిస్తుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్‌బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత జూన్‌లో మరో మూడు నెలల పాటు మారటోరియం వ్యవధిని పొడిగించింది. ఈ వ్యవధిలో ఈఎంఐలపై చక్రవడ్డీ వసూలు చేయరాదని పలువురు పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశాలతో వడ్డీపై వడ్డీని వెనక్కితీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. కాగా ఈ పిటషన్‌లపై నవంబర్ 2న సుప్రీంకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. కాగా, మారటోరియం పధకాన్ని ఉపయోగించుకోకుండా ఈఎంఐలను యథావిథిగా చెల్లిస్తున్న వారికీ చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నారు