New Delhi, September 27: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు నేడు దేశవ్యాప్తంగా బంద్ (Bharat Bandh) ప్రారంభమైంది. కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ, టీడీపీ, వైసీపీ పార్టీలు సహా పలు రైతు సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిరసన శిబిరాల నుంచి రైతులు ఢిల్లీకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇండియా గేట్, విజయ్ చౌక్ సహా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఏపీలోనూ బంద్ కొనసాగుతోంది. బంద్‌కు అధికార వైసీపీ మద్దతు ప్రకటించడంతో గత రాత్రి నుంచే ఆర్టీసీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. నేటి మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసి బంద్‌కు సంఘీభావం ప్రకటిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
మరోవైపు, తెలంగాణలోనూ బంద్ ప్రారంభమైంది. పలు జిల్లాల్లో బస్సులు నిలిచిపోయాయి. హనుమకొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, వామపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలో 842 బస్సులు నిలిచిపోయాయి. రోడ్లపై బైఠాయించిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేటి సాయంత్రం 4 గంటల వరకు బంద్ కొనసాగుతుందని, బంద్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా (Samyukta Kisan Morcha) ప్రకటించింది.
బంద్ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. బంద్‌కు సంఘీభావంగా మధ్యాహ్నం 12 వరకు ఏపీ ప్రభుత్వం బస్సులను నిలిపివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 గంటల తర్వాతే ఏపీకి బస్సులు నడపాలని నిర్ణయించారు.
కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపి సోమవారానికి (సెప్టెంబర్ 27) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా 40 రైతుల సంఘాల ఉమ్మడి వేదికైన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) దేశవ్యాప్త బంద్‌కు (Farm Unions Protest Against Three Farm Laws) పిలుపునిచ్చింది. ప్రజా సంఘాలు, ప్రజల మద్దతు కోరింది. బంద్ సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని ఎస్‌కేఎం తెలిపింది. దీనికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ తెలిపింది. బంద్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని పంజాబ్ సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ ప్రకటించారు. బంద్‌కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడెరేషన్ కూడా మద్దతు ప్రకటించింది. బంద్ దృష్ట్యా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని సరిహద్దుల్లో అదనపు బలగాలను
మోహరించారు.
రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేరళలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళలో భారత్ బంద్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి.
ఢిల్లీ- అమృత్‌సర్ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్ బంద్ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు నడుంబిగించాయి. పంజాబ్-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు ఓ రైతు మీడియాతో పేర్కొన్నాడు.
ఉత్తరప్రదేశ్ ఘజిపూర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.