Representational Image (Pic Credit- ANI)

New Delhi, May 24: ఈ నెల 25న భారత్ బంద్ కు ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. కుల ఆధారిత ఓబీసీ జనగణనను కేంద్రం నిర్వహించకపోవడానికి నిరసనగా.. పలు డిమాండ్లతో బంద్ చేపట్టనుంది. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, రైతులకు కనీస మద్దతు ధర, పాత పెన్షన్ విధానం అమలు, ఎన్ ఆర్సీ, సీఏఏ, ఎన్ పీఆర్ ఉపసంహరణ వంటి డిమాండ్ల సాధన కోసం బంద్ చేపట్టనున్నట్లు ఫెడరేషన్ నేతలు తెలిపారు. భారత్ బంద్‌ను (Bharat Bandh on May 25) విజయవంతం చేయాలని వారు ప్రజలను కోరారు.

ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) కుల ప్రాతిపదికన జనాభా గణనను కేంద్రం నిర్వహించనందుకు ఆలిండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (బీఏఎంసీఈఎఫ్) బుధవారం (మే 25) భారత్ బంద్‌కు (Nationwide Bandh) పిలుపునిచ్చిందని సహరాన్‌పూర్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ ధీమాన్ వెల్లడించారు. కుల ప్రాతిపదికన జనాభా గణన డిమాండ్‌తో పాటు, ఎన్నికల సమయంలో ఈవీఎంల వినియోగం మరియు ప్రైవేట్ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అంశంపై కూడా ఫెడరేషన్ నిరసన వ్యక్తం చేస్తోంది.

సోనియా గాంధీ సంచలన ప్రకటన, రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టాస్క్‌ఫోర్స్ 2024 కమిటీ ఏర్పాటు, దీంతో పాటు భార‌త్ జోడే పాద‌యాత్ర క‌మిటీ కూడా రెడీ

ఎన్నికల సమయంలో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తుంది. ఈవీఎంల వినియోగంలో కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తోంది. మరోవైపు రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చెయ్యాలని డిమాండ్ చేస్తుంది. మద్దతు ధర కల్పిస్తామని కేంద్రం హామీలు ఇచ్చినా ఆ హామీలు సరిగా అమలు కావటం లేదు. దీంతో మద్దతు ధర హామీకి చట్టాన్ని చెయ్యాలని డిమాండ్ చేస్తుంది.

దేశంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని , కేంద్రం తీసుకువచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్ పి ఆర్ ఉపసంహరణ చేయటంపైన కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. మధ్యప్రదేశ్, ఒరిస్సా లో పంచాయతీ ఎన్నికలలో ఓబిసి రిజర్వేషన్లను అమలు చేయడం వంటి డిమాండ్లను చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ముసుగులో గిరిజనులను తరలించడం వంటివి చేయరాదని పేర్కొంది. నిర్బంధంగా టీకాలు వేయించరాదని, దేశంలో టీకాలు వేయడం తప్పనిసరి కాదంటూ వెల్లడించింది.

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో కార్మికులపై రహస్యంగా రూపొందించిన కార్మిక చట్టాల నుండి రక్షణ కల్పించాలని పేర్కొంది. ఈ ప్రధాన డిమాండ్లతో భారత్ బంద్ నిర్వహించనున్నారు. మే 25న భారత్ బంద్ సందర్భంగా వర్తక వాణిజ్య సముదాయాలను, ప్రజా రవాణాను నిలిపివేయాలని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మరి రేపు నిర్వహించనున్న భారత్ బంద్ ఎలా కొనసాగుతుందో తెలియాల్సి ఉంది.

భారత్ బంద్‌ పిలుపునకు కారణాలు, డిమాండ్లు ఇవే…

* కులాల ఆధారంగా ఓబీసీ జనాభా గణన చేపట్టని కేంద్రం

* ఈవీఎం కుంభకోణం

* ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలుకు డిమాండ్

* రైతులకు కనీస మద్దతు ధర హామీ ఇచ్చేలా చట్టం చేయాలి

* NRC/CAA/NPRకి వ్యతిరేకంగా

* పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్

* మధ్యప్రదేశ్, ఒడిశా పంచాయితీ ఎన్నికల్లో OBC రిజర్వేషన్లలో ప్రత్యేక ఓటర్లు అమలు చేయాలి

* పర్యావరణ పరిరక్షణ పేరుతో గిరిజన నిర్వాసితులకు వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలకు నిరసనగా

* టీకాపై బలవంతపు ఒత్తిడికి వ్యతిరేకంగా

* లాక్‌డౌన్‌లో రహస్యంగా కార్మికులపై చేసిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన

మే 25న తాము చేపట్టబోయే బంద్ కు మద్దతుగా వ్యాపారాలు, ప్రజా రవాణాను మూసివేయాలని ఫెడరేషన్ నేతలు కోరుతున్నారు.