Patna, Feb 28: 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన బీహార్ సైనికుడి కుటుంబానికి ఘోర అవమానం జరిగింది, వైశాలిలోని జందాహాలోని ప్రభుత్వ భూమిలో తన కొడుకు కోసం స్మారక చిహ్నం నిర్మించినందుకు సైనికుడి తండ్రిని పోలీసులు (Galwan Valley Martyr’s Father Thrashed) కొట్టారని, ఆపై అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రెండేళ్ల కిత్రం గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన జై కిషోర్ సింగ్ తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను పోలీసులు ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.ఈ సంఘటన గురించి సింగ్ సోదరుడు మాట్లాడుతూ, డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు ( Arrested Over ‘Encroachment) చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్ స్టేషన్‌లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని వాపోయారు.
వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలోనే సింగ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్‌లో దీని చుట్టూ గోడ కట్టారు.
అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.అరెస్ట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.
అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. SDPO మహువా మాట్లాడుతూ.. జనవరి 23న, రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ భూమిలో & జండాహాలోని ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని నిర్మించారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై SC/ST చట్టం కింద కేసు నమోదు చేశాం. తరువాత, విగ్రహానికి సరిహద్దు గోడలు నిర్మించబడ్డాయి. అక్రమ ఆక్రమణ కారణంగా భూ యజమాని హక్కుల ఉల్లంఘన జరిగిందని అన్నారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాజ్ కపూర్ సింగ్‌పై IPC సెక్షన్ 188 (అవిధేయత మానవ ప్రాణాలకు ప్రమాదం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (ప్రజా భంగం కలిగించడం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. 10 అడుగుల x 10 అడుగుల మెమోరియల్‌ని గత ఏడాది ఫిబ్రవరి 24న పాక్షికంగా నిర్మించినట్లు నివేదిక పేర్కొంది. దివంగత సైనికుడి ప్రతిమను ఆయన ఇంటి ముందున్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయగా, కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. గతేడాది డిసెంబరులో చుట్టూ గోడ కట్టారు.