Donald Trump to remove birthright citizenship

New York, Jan 24: US 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 127 ఏళ్లుగా దేశంలో అమల్లో ఉన్న ‘జన్మతః పౌరసత్వ హక్కు’ను (Birthright citizenship)రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అయితే ఈ ఆర్డర్ చట్ట విరుద్ధమంటూ డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలపై అక్కడి 22 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. సియాటిల్ కోర్టు ఈ ఆదేశాలను తాత్కాలికంగా రద్దు చేసింది. ఇక ట్రంప్ ఆదేశాలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి.

అయితే దీనిపై భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి కారణం ట్రంప్ నిర్ణయ ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడుతుంది. అక్కడ హెచ్1బీ లేదంటే ఎల్1 వీసాలపై తాత్కాలికంగా ఉంటున్న భారతీయులకు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అక్కడున్న భారతీయ గర్భిణులు కొత్త మార్గం వెతుక్కున్నారు.

యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే గర్భిణులుగా ఉన్న మహిళలు ఫిబ్రవరి 20 లోగానే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా డెలివరీకి దగ్గరగా ఉన్నవారు సిజేరియన్ ద్వారా (C-Sections On Rise As Indians In US) పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. దీంతో అమెరికాలోని ఆసుపత్రులు ఒక్కసారిగా కిక్కిరిసిపోతున్నాయి. ఫిబ్రవరి 20వ తేదీలోపు జన్మించే పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది కాబట్టి ఆ లోపే ఏదో రకంగా పిల్లలకు జన్మనివ్వాలన్న ఆత్రుత కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రుల్లో ఒకరు ఇప్పటికే అమెరికా పౌరులైనా, లేదంటే గ్రీన్ కార్డు ఉన్నా వారికి పౌరసత్వం లభిస్తుంది. లేదంటే పుట్టిన పిల్లలకు 21 ఏళ్లు వచ్చాక వారితో కలిసి ఉండే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో గడువుకు ముందే పౌరసత్వం లభించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 8, 9 నెలల గర్భిణులు ఆసుపత్రికి క్యూ కడుతున్నట్టు న్యూజెర్సీకి చెందిన డాక్టర్ ఎస్‌డీ రోమా తెలిపారు. ఏడు నెలల గర్భిణి ఒకరు భర్తతో కలిసి వచ్చారని, నెలలు నిండకముందే ఆపరేషన్‌కు పట్టుబట్టినట్టు చెప్పారు.

నిజానికి ఆమెకు మార్చిలో డెలివరీ కావాల్సి ఉందన్నారు. తమ వద్దకు కూడా ఇలాంటి వారే వస్తున్నట్టు టెక్సాస్‌కు చెందిన గైనకాలజిస్ట్ డాక్ట్ ఎస్‌జీ ముక్కాల తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ముందస్తుగా డెలివరీ చేయడం వల్ల ఊపరితిత్తుల సమస్యతోపాటు పాలు ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వల్ల నాడీ సంబంధిత సమస్యలు వస్తాయని హెచ్చరించారు. గత రెండు రోజుల్లో తనను 15 నుంచి 20 మంది ఈ విషయంలో సంప్రదించినట్టు తెలిపారు.

AD