New York, Jan 24: అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులకు ట్రంప్ రాకతో తీసుకుంటున్న నిర్ణయాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు అప్పు చేసి అమెరికాకు పంపించారని, వారికి మరింత భారం కావొద్దనే ఉద్దేశంతో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్న వారిపై ట్రంప్ కొరడా ఝళిపిస్తాడేమోననే భయం (Trump's Deportation warning) వెంటాడుతోంది.
ఉన్నత చదువుల కోసం వచ్చిన విదేశీయులు ఇలా పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం చట్టవిరుద్ధం.. స్టూడెంట్ వీసా మీద అమెరికాలో అడుగుపెట్టిన వారు ఉద్యోగం చేయడానికి ఇమిగ్రేషన్ చట్టాలు ఒప్పుకోవు.చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు వారి యూనివర్సిటీలో (ఆన్ క్యాంపస్) వారానికి 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు మాత్రం ఉంటుంది.
అయితే, వర్సిటీలో వందలాదిగా ఉండే విద్యార్థులు అందరికీ పని దొరకదు. దీంతో చాలామంది అనధికారికంగా బయట హోటళ్లు, పెట్రోల్ బంక్ లు తదితర వాటిలో పార్ట్ టైమ్ చేస్తుంటారు. విదేశీ విద్యార్థులు ఇలా పనిచేస్తూ పట్టుబడితే ఇమిగ్రేషన్ అధికారులు వారి స్టూడెంట్ వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారు. ఆ తర్వాత మళ్లీ విద్యార్థిగా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం దాదాపుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారికి శాపంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులను ఈ భయమే వెంటాడుతోంది. దీంతో చాలామంది తమ పార్ట్ టైమ్ ఉద్యోగాన్ని(Indian students quitting part-time jobs) వదులుకుంటున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీలలో పట్టుబడితే స్టూడెంట్ వీసా రద్దవుతుందనే ఆందోళనతో ముందుజాగ్రత్త పడుతున్నారు. అమెరికాలో ఉన్నతవిద్య కోసం దాదాపు 50 వేల డాలర్లు (రూ.42 లక్షలకు పైగా) ఖర్చయిందని, ఇప్పుడు వీసా రద్దయి ఇండియాకు వెళ్లాల్సివస్తే ఆ అప్పు తీర్చే మార్గమే ఉండదని ఓ విద్యార్థి వాపోయాడు. ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేశాక వలస విధానంలో మార్పులు, అనధికారికంగా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి వెనక్కి పంపించేందుకు కఠిన చర్యలు చేపట్టాడని వివరించారు.