Election Commission of India. File Image. (Photo Credits: PTI)

New Delhi, May 26: దేశంలో ఉప ఎన్నికల నగారా మోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఏర్పడిన పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆరు రాష్ట్రాల్లో 3 ఎంపీ, 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకారం.. ఈనెల 30న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 6. నామినేషన్ల పరిశీలన జూన్‌7న. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూన్‌ 9. జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్‌ 26న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్‌ 28న ఉప ఎన్నికల షెడ్యూల్‌ ముగుస్తుంది. కాగా, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఉప​ ఎన్నిక జరిగే స్థానాలు

►ఉత్తర ప్రదేశ్‌: రెండు ఎంపీ స్థానాలు (రాంపూర్‌, అజాంఘర్‌)

►పంజాబ్‌: ఒక ఎంపీ స్థానం (సంగ్రూర్‌)

►త్రిపుర: నాలుగు అసెం‍బ్లీ స్థానాలు (అగర్తల, టౌన్‌ బోర్డోవళి, సుర్మా, జుబరాజ్‌నగర్‌)

► ఆంధ్రప్రదేశ్‌: ఒక అసెంబ్లీ స్థానం (ఆత్మకూరు)

►ఢిల్లీ: ఒక అసెంబ్లీ స్థానం (రాజిందర్‌ నగర్‌)

►జార్ఖండ్‌: ఒక అసెం‍బ్లీ స్థానం (మాందార్‌)