Raipur, August 15: ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ శుభవార్త వినిపించారు. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని కొత్తగా నాలుగు జిల్లాలు (Chhattisgarh to Get 4 New Districts, 18 Tehsils) ఏర్పాటు చేస్తున్నామని సీఎం (CM Bhupesh Baghel) తెలిపారు. దీంతో జిల్లాల సంఖ్య 32కు చేరుతుందన్న సీఎం.. అన్ని జిల్లాల్లో మహిళల కోసం పార్కులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
నక్సల్స్ ముప్పును ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. కొత్తగా మోహ్ల – మన్‌పూర్, శక్తి, సారంగర్హ్ – బిలాయిగర్హ్, మనేంద్రగర్హ్ జిల్లాల ఏర్పాటుతో పాటు 18 కొత్త తహసీల్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ జిల్లా కేంద్రం, మున్సిపల్ కార్పొరేషన్లలో మహిళల కోసం పార్కులు అభివృద్ధి చేయబడుతాయని, వాటికి మినీమాత ఉద్యాన్ అని నామకరణం చేస్తామని సీఎం తెలిపారు.
నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బస్తర్ ఫైటర్స్ బెటాలియన్ కింద 2,800 మంది పోలీసులను రిక్రూట్ చేస్తామని చెప్పారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో అన్ని రకాల సదుపాయాలతో 63 పోలీసు స్టేషన్లను నిర్మిస్తున్నామని సీఎం భూపేశ్ బఘేల్ తెలిపారు.