Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, June 06: కొద్దిరోజులుగా భానుడి ప్రతాపంతో ఉడికిపోయిన ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురును అందించింది. రాబోయే ఐదు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎలాంటి వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తున్నాయని, వచ్చే వారం నాటికి దక్షిణ భారతదేశం అంతటా మరియు మధ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన రుతుపవనాలు ఆవరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాగల 2 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

శుక్రవారం దేశ రాజధాని దిల్లీతో పాటు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి.

వాయువ్య భారతదేశంలో కూడా చురుకైన పవనాలు మరియు నిసర్గ తుఫాను కారణంగా ఏర్పడిన తేమ వర్షాలకు దారితీసిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తేమ ప్రభావంతో తీరప్రాంతంలో ఉక్కపోత వాతావరణం కనిపించిందని, ఆంధ్రప్రదేశ్ లోని కావలి తీరంలో నిన్న దేశంలోనే అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత వద్ద నమోదైందని ఐఎండి తన రోజువారీ బులెటిన్లో తెలిపింది.

రాబోయే 3-4 రోజులలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో నేటి నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఇప్పటికే చల్లబడింది.

ఇక రాబోయే 2 రోజులలో కేరళ, కొంకణ్ తీర ప్రాంతం మరియు గోవాలో భారీవర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది.