COVID19 Outbreak | Photo: Twitter

New Delhi, August 12: భారత్‌లో 24 గంటల్లో 60,963 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 834 మంది మృతి (Coronavirus Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 23,29,639 కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 46,091 కి పెరిగింది. 6,43,948 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా (Coronavirus Cases in India) నుంచి ఇప్పటివరకు 16,39,600 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,60,15,297 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 7,33,449 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ (ICMR) వివరించింది.

దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్‌ కేసుల శాతం 27.64గా ఉంది. ప్రస్తుతం రికవరీ రేటు 70.38 శాతం ఉండగా.. మరణాల రేటు 1.98 శాతంగా ఉంది. కరోనా అత్యంత ప్రభావిత దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్‌ తర్వాత ఇండియా మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే అమెరికా, బ్రెజిల్‌తో పోలిస్తే ఒక రోజులో నమోదయ్యే పాజిటివ్‌ కేసుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. స్పుత్నిక్ వీ కోసం క్యూ కడుతున్న దేశాలు, రష్యా తొలి వ్యాక్సిన్ కోసం 20 దేశాల నుంచి బిలియన్ డోసుల కంటే ఎక్కువ ప్రీ ఆర్డర్లు, సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి

గత వారం రోజులుగా(ఆగష్టు 4-10) ఇండియాలో రికార్డు స్థాయిలో 4,11,379 మంది కరోనా బారిన పడగా.. 6,251 మంది మహమ్మారి కారణంగా మరణించారు. అదే సమయంలో అమెరికాలో 3,69,575 కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7,232 కరోనా మరణాలు సంభవించాయి. ఇక బ్రెజిల్‌ విషయానికి వస్తే.. 3,04,535 మందికి వైరస్‌ సోకగా.. 6,914 మంది కోవిడ్‌తో మృతి చెందారు. అయితే గత నాలుగు రోజులుగా దేశంలో వరుసగా 60 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు 70 శాతంగా ఉండటం భారత్‌కు సానుకూలాంశమని చెప్పవచ్చు.

ఈ రెండు దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగానే ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 16 లక్షలకు చేరువైనట్లు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. మరణాల రేటు 1.99 శాతానికి పడిపోయిందని వెల్లడించిన విషయం తెలిసిందే.