New Delhi July 2: దేశంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి లాక్‌డౌన్ ( India Lockdown) విధించి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. దేశంలో ఇప్పుడు కోవిడ్-19 కేసులు (COVID-19 in India) ఆరు లక్షల మార్కును దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 19,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా 434 మంది మరణించారు, దీంతో దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 6,04,641కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 17834కు (Coronavirus Deaths) పెరిగింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడినవారిలో 3,59,860 మంది బాధితులు కోలుకోగా, 2,26,947 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఒక్కరోజులోనే 1000కి పైగా కేసులు, రాష్ట్రంలో 17 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 267కు పెరిగిన మరణాలు
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో పెద్దఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో దేశంలో కరోనా కేసులు ఆరు లక్షలు దాటాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రష్యా కంటే భారత్ కేవలం 50 వేల కేసుల దూరంలో నిలిచింది. 26 లక్షల కేసులతో అమెరికా, 14 లక్షల కేసులతో బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. దేశంలో జూలై 1వ తేదీ వరకు 90,56,173 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒకేరోజు దేశవ్యాప్తంగా 2,29,588 పరీక్షలు చేశామని వెల్లడించింది. ముంబైలో మళ్లీ 144 సెక్షన్, మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా కల్లోలం, ప్రారంభమైన స్థానిక రైళ్లు, కోవిడ్-19 నేపథ్యంలో అక్కడ వినాయక ఉత్సవాలు రద్దు
దేశంలో లాక్‌డౌన్ విధించి నేటితో వంద రోజులు పూర్తయ్యింది. తొలుత మార్చి 25న మూడు వారాలపాటు (ఏప్రిల్ 14 వరకు) లాక్‌డౌన్ విధించారు. అప్పటికి దేశంలో దాదాపు 600 కేసులు ఉండగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. అనంతరం మూడో విడుతలో మరో రెండు వారాలపాటు (మే 17 వరకు) లాక్‌డౌన్ పొడిగించిన కేంద్రం.. దేశాన్ని రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించింది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. జూన్ 8 నుంచి షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. జూలై 1నుంచి అన్‌లాక్ 2.0 మొదలైంది.
భారత్ లో రోజుకు దాదాపు 20 వేల కేసులు వస్తున్నవేళ, మరో నాలుగైదు రోజుల్లోనే ప్రపంచంలో కరోనా కేసుల్లో మూడో స్థానానికి ఇండియా చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి స్థానంలో అమెరికా 26 లక్షలకు పైగా కేసులతో ఉండగా, రెండో స్థానంలో బ్రెజిల్ 14 లక్షల కేసులతో కొనసాగుతున్నాయి.ఇక ఇండియా విషయానికి వస్తే, కొత్తగా వస్తున్న కేసుల్లో 90 శాతం పది రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కాస్తంత తగ్గింది. జూన్ లోనే ఢిల్లీలో కేసుల సంఖ్య లక్షను దాటుతుందని తొలుత అంచనా వేయగా, ప్రస్తుతం 87 వేల కేసులకు ఢిల్లీ చేరుకుంది. కంటెయిన్ మెంట్ జోన్లలో పాటిస్తున్న కఠిన నిబంధనలు కొంతమేరకు ప్రభావం చూపుతున్నాయి.