New Delhi, September 27: భారత్‌లో గత 24 గంటల్లో 88,600 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,992,533కు (Coronavirus Outbreak in India) చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 1,124 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health and Family Welfare) తెలిపింది. దేశంలో యాక్టవ్ కేసుల సంఖ్య 9,56,402గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 49,41,628కు చేరుకుంది. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 38 లక్షలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 16,28 శాతం ఉన్నాయి.
సెప్టెంబర్ 26 వరకు దేశంలో 7,12,57,836 నమూనాలను పరీక్షించామని భారతీయ వైద్య పరిశోధాన మండలి (ఐసీఎమ్మార్) ప్రకటించింది. నిన్న ఒకేరోజు 9,87,861 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది. మరోవైపు కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు కలసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. కరోనా వైరస్ చైనాలో వూహాన్‌లో ప్రబలిన తొమ్మిది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా పాజిటివ్‌గా (Uma Bharti Tests COVID-19 Positive) నిర్ధారణ అయ్యింది. ఆమె ఈ విషయాన్ని స్వయంగా శనివారం అర్ధరాత్రి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. గత మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఇటీవల హిమాలయాలకు వెళ్లినపుడు సామాజిక దూరం సహా.. కోవిడ్ నిబంధనలను పాటించినప్పటికీ కరోనా వైరస్ సోకింది అని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు.
ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'నేను ప్రస్తుతం హరిద్వార్, రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్ వద్ద క్వారంటైన్‌లో ఉన్నాను. నాలుగు రోజుల తర్వాత మరోసారి కోవిడ్ పరీక్ష చేయించుకుంటాను. పరిస్థితి ఇలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తాను' అంటూ ట్వీట్ చేసింది