New Delhi, April 25: దేశంలో ప్రతీరోజు కనీసం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా దేశవ్యాప్తంగా మరో 1429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 24,506 దాటింది. అదే సమయంలో కొత్తగా మరో 57 మరణాలు నమోదు కావడంతో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 775కి పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ఇప్పటివరకు 5065 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 18,668 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది, ముఖ్యంగా ఎక్కువ కేసులన్నీ ముంబై నగరం నుంచే ఉన్నాయి. ఇక్కడ జనసాంద్రత అధికంగా ఉండటం, అతిపెద్ద మురికివాడలు ఉండటం చేత కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య దేశంలోనే అత్యధికంగా 6817 కు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన 775 మరణాలలో కూడా మహారాష్ట్ర నుంచే 301 మరణాలు ఉండటం ఇక్కడి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్రలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 4 వేలకు పైగా కేసులు, 200కు పైగా మరణాలు ఒక్క ముంబై నగరంలోనే నమోదయ్యాయి.
మహారాష్ట్ర తర్వాత గుజరాత్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. గుజరాత్‌లో పాజిటివ్ కేసులు 2815 దాటగా, మరణాల సంఖ్య 127కు చేరింది. ఆ తర్వాత న్యూ ఢిల్లీలో 2514 కేసులు, గుజరాత్‌లో 1851, రాజస్థాన్ రాష్ట్రంలో 2,034, మధ్యప్రదేశ్‌లో 1,852, తమిళనాడులో 1,755 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్1-9 కేసుల సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. తెలంగాణలో కేసుల సంఖ్య 983కు చేరగా, ఆంధ్రప్రదేశ్‌లో 955గా నమోదయ్యాయి.
ఇక శుక్రవారం నాటికి, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 15 జిల్లాలలో గత 28 రోజుల ఎలాంటి కొత్త కేసులు నివేదించబడలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరికొన్ని లాక్డౌన్ నిబంధనలను సడలించింది. హాట్‌స్పాట్ కాని ప్రాంతాలలో మాల్స్ మినహాయించి, సామాజిక దూరం పాటించేలా చిన్న చిన్న దుకాణాలకు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.