New Delhi, March 15: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం (Central Govt) విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి (State Disaster Response Fund) కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను నోటిఫైడ్ విపత్తుగా(Notificed disaster)గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.
ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కాగా, కర్ణాటకలోని కలబుర్గి, ఢిల్లీలో కరోనాతో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. భారత్‌లో ప్రస్తుతం 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా బాధితులు మరణించగా.. 1,45, 810 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక కోవిడ్ భయాల నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి... షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల ఆఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణాలో విద్యాసంస్థలు, మాల్స్, థియేటర్లు అన్నీ బంద్, మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు
క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా కట్టడి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మూసివేశారు.
2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్, చైనాని నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. కరోనా మహమ్మారి 145 దేశాలకు విస్తరించింది. చైనాలో కరోనా మరణాలు ఆగడం లేదు. అటు యూరప్ లో కరోనా మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు లక్షా 45వేల 700ల మందికి కరోనా సోకగా వారిలో 5వేల 438 మంది చనిపోయారు.