Coronavirus Outbreak in India: తెలంగాణలో 18, ఆంధ్రప్రదేశ్‌లో 3 కలిపి దేశవ్యాప్తంగా 206కు చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్రలో విజృంభిస్తున్న వైరస్
Coronavirus Outbreak in India. | Photo-PTI

New Delhi, March 20:  తెలంగాణలో (Telangana) కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus Spread) శుక్రవారం 18కు పెరిగింది, లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి మరియు దుబాయ్ నుంచి వచ్చిన మరొకరికి నిర్వహించిన వైద్యపరీక్షల్లో కోవిడ్-19 పాజిటివ్ అని తేలటంతో వీరికి గాంధీ అసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఇందులో దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి మార్చి 11న పంజాగుట్టలోని నెక్స్ట్ గెలెరియా మాల్ ను సందర్శించినట్లు తెలిసింది. దీంతో ఆరోజున మాల్ ను సందర్శించిన వారందరూ 14 రోజుల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. కరోనాలక్షణాలు ఏవైనా అనిపిస్తే వెంటనే వైద్యసహాకారం తీసుకోవాలని కోరింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3కు చేరింది. మక్కాలో పర్యటించి విశాఖపట్నం వచ్చిన వృద్ధుడికి కరోనావైరస్ నిర్ధారణ అయింది. ఈయన రెండు రోజుల పాటు హైదరాబాదులో  కూతురు ఇంటికి వెళ్లి వచ్చినట్లు కూడా తెలిసింది.  ఏపీలో రెండో కేసుగా నమోదైన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ప్రస్తుతం ఒంగోలు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. తొలి కేసు నెల్లూరులో నమోదైన విషయం తెలిసిందే, ఈయన ప్రస్తుతం కోలుకుంటున్నారని సమాచారం.

ఇక దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య (COVID 19 Outbreak in India) రెండు వందలకు చేరువయ్యింది. శుక్రవారం ఉదయం నాటికి 196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ప్రస్తుతం 172 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 19 మంది రోగులు డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది. మరొకరు ఇతర ప్రాంతానికి తరలిపోయారు. భారత్ లో నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో 32 మంది విదేశీ పౌరులు ఉన్నారు, వీరిలో ఇటలీ నుంచే 17 మంది ఉన్నారు.  ఈనెల 22న 'జనతా కర్ఫ్యూ' కు పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

భారతదేశంలో ఇప్పటివరకు దిల్లీ, మహారాష్ట్ర , కర్ణాటక మరియు పంజాబ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున 4 మరణాలు నమోదైనట్లు శుక్రవారం ఉదయం వెల్లడించిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.

అత్యధిక కేసులు మహారాష్ట్రలో (Maharashtra) 47 నమోదయ్యాయి. కేరళ 28 కేసులతో ఆ తరువాత స్థానంలో ఉంది.

భారత్ విషయం ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు గురువారం నాటికి 2 లక్షలు దాటాయి, ఇక వీరిలో 85 వేల మంది కోలుకున్నట్లు సమాచారం. అయితే వైరస్ బారినపడి ఇప్పటికి 9,800 మంది ప్రాణాలు కోల్పోయారు.