Ratan Tata (Photo Credits: Instagram)

New Delhi, Mar 29: ప్రపంచాన్ని వణికిస్తూ.. ప్రజలకు నిద్రలేని రాత్రులను చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై (Coronavirus pandemic) యుద్ధానికి టాటా గ్రూప్‌ (Tata Trusts) శనివారం భారీ విరాళం ప్రకటించింది. తొలుత రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించిన టాటా ట్రస్టు, అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు ‘టాటా సన్స్‌’ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ (N CHANDRASEKARAN) ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్‌ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయ్యింది.

బాధ్యతగా విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు

కరోనా వైరస్‌ (Coronavirus Outbreak in India) బాధితులకు అవసరమైన వెంటిలేటర్లను సాధ్యమైనంత త్వరగా అందజేస్తామని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. వాటిని తయారు చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. దేశంలో.. ప్రపంచంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో వేగవంతమైన నివారణ చర్యలు అవసరమని తెలిపారు. కరోనా నివారణకు టాటా ట్రస్టుతో కలిసి పని చేస్తామన్నారు.

Here's Ratan Tata Tweet

కోవిడ్ 19 నివారణతోపాటు సహాయక కార్యకలాపాలకు రూ.500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్టు ప్రకటించింది. అలాగే తాము ఇవ్వనున్న రూ.1,000 కోట్లతో డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు, కరోనా టెస్టింగ్‌ కిట్లు అందజేయనున్నట్లు టాటా సన్స్‌ తెలిపింది.

కోవిడ్ 19పై యుద్ధం కోసం 64 దేశాలకు అమెరికా భారీ సహాయం

కరోనాను అరికట్టే విషయంలో తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చిందని టాటా ట్రస్టు చైర్మన్‌ రతన్‌ టాటా (Tata Group Chairman Ratan Tata) వ్యాఖ్యానించారు. మానవ జాతి ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లలో కరోనా కూడా ఒకటని ఆయన తెలిపారు.

కాగా కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సాయపడేందుకు తమ పార్టీ ఎంపీలు రూ.1 కోటి చొప్పున ఎంపీల్యాడ్స్‌ కేటాయించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒక నెల వేతనం విరాళంగా అందిస్తారని తెలిపారు. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలు లాక్‌డౌన్‌తో ఇబ్బందిపడే 5 కోట్ల నిరుపేదలకు 21 రోజులపాటు అన్నదానం చేస్తుందన్నారు. కేంద్రమంత్రి సురేశ్‌ప్రభు తన ఒక నెల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకు సన్‌ ఫార్మా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ తదితర మందులు, శానిటైజర్లను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది.

కరోనాపై పోరుకు దక్షిణ కొరియాలో వినియోగిస్తున్న అత్యాధునిక పరీక్ష కిట్లను అందించనున్న హ్యుండయ్‌ మోటార్స్‌ ప్రకటించింది. ఇవి 25 వేల మందికి ఉపయోగపడతాయని తెలిపింది. కరోనాపై పోరులో సర్కారుకు బాసటగా నిలిచేందుకు ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వాలని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) తన ఉద్యోగులను కోరింది.