PM Narendra Modi and US President Donald Trump. (Photo Credits: Getty Images)

New Delhi, Mar 28: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(COVID 19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా (America) ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీకి ఇది అదనం అని చెప్పవచ్చు.

ఇటలీలో కరోనా చావు కేకలు, ఒక్క రోజే 1000 మంది మృతి

కోవిడ్ 19 అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(CDC) సహా ఇతర సంస్థలకు ఈ గ్లోబల్‌ ప్యాకేజీ ద్వారా నిధులు సమకూరనున్నాయి. ఇందులో భాగంగా అమెరికా నుంచి భారత ప్రభుత్వానికి 2.9 మిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక సహాయం అందనుంది.

భారత్‌లో (India) ల్యాబ్‌ల అభివృద్ధి, కరోనా కేసులపై నిరంతర పర్యవేక్షణ, ఇందుకు సంబంధించిన సాంకేతికత అభవృద్ధికై ఈ సహాయం అందజేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం (America Govt) పేర్కొంది. అమెరికా ప్రకటించిన గ్లోబల్‌ ప్యాకేజీ ద్వారా శ్రీలంకకు 1.3 మిలియన్‌ డాలర్లు, నేపాల్‌కు 1.8 మిలియన్‌ డాలర్లు, బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్‌ డాలర్లు, అఫ్గనిస్తాన్‌కు 5 మిలియన్‌ డాలర్లు దక్కనున్నాయి.

ఇండియాలో 78 మంది రికవరీ, 873కి చేరిన కరోనా కేసులు

ఈ సంధర్భంగా అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(USAID) డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌ బోనీ గ్లిక్‌ మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు చేసే సహాయంలో అమెరికా సరికొత్త రికార్డును నెలకొల్పిందన్నారు.

కాగా కోవిడ్‌ వైరస్‌ విజృంభణతో ఉత్పన్నమయ్యే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు రెండు లక్షల ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు 1500 లక్షల కోట్ల రూపాయలు) ప్రతిపాదించిన ప్రత్యేక బిల్లుకు ఆమెరికా సెనేట్‌ ఆమోదం తెలిపింది. సమగ్ర చర్చ అనంతరం 96–0 మెజారిటీతో బుధవారం సాయంత్రం సెనేట్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు శుక్రవారం నాడు ప్రజా ప్రతినిధుల సభ ఆమోదానికి రానుంది. ఆ సభ అనంతరం దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంతకంతో బిల్లు ఆమోదంలోకి వస్తోంది.

ఇక అతిపెద్ద జనాభా గల దేశమైన భారత్‌లో కరోనా వైరస్‌ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే.