New Delhi, Mar 23: దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court) కీలక ఆదేశాలు జారీచేసింది. సోమవారం సాయంత్రం 5.00 గంటలలోపు న్యాయవాదుల అన్ని చాంబర్లను సీల్ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే (Chief Justice of India SA Bobde) ఆదేశించారు.
దేశంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, పాజిటివ్ కేసులు 415
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు వ్యక్తిగత వాదనలు ఉండవని స్పష్టం చేశారు.
కాగా ఏమైనా అత్యవసర కేసులు ఉంటే వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుతామని వెల్లడించారు. న్యాయవాదులు తమ ఆఫీసులో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణకు హాజరుకావాలని సీజే సూచించారు. ఈ ఆదేశాలను ప్రతి వారం సమీక్షిస్తామని, కోర్టుహాల్లో న్యాయవాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా హాజరు కావద్దని తెలిపారు.
మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి: ప్రధాని మోదీ
కాగా కోర్టులోకి ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే ఐడీ కార్డులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీజే బాబ్డే ప్రకటించారు. దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్న విషయ తెలిసిందే. ప్రజలంతా లాక్‌డౌన్ పాటించాలని కేంద్రం ఆదేశించింది. లాక్ డౌన్ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇండియాలో సోమవారం ఉదయం నాటికి కరోనా కేసుల సంఖ్య 415కు చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుతం కరోనా మృతుల సంఖ్య (COVID-19 Deaths in India) ఎనిమిదికి చేరింది. మహారాష్ట్రలో (Maharashtra) పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అక్కడ మూడో మరణం నమోదైంది.