Coronavirus Outbreak. Representational Image. | Pixabay Pic

New Delhi, Mar 24: దేశంలో కరోనావైరస్ కల్లోలం రేపుతోంది. తాజాగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రపంచం చూడని కొత్త రకం కరోనా కూడా మన దేశంలో వెలుగులోకి వచ్చింది. ‘డబుల్ మ్యుటెంట్’ రకంగా (Double Mutant Strain) పిలవబడే ఈ వైరస్ వివరాలను స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. బుధవారం ఈ కొత్త కరోనా వైరస్ లు, డబుల్ మ్యుటెంట్ వైరస్ (New double mutant strain) గురించి పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

ఇదిలా ఉంటే విదేశాల నుంచి ఇండియాలోకి ప్రవేశిస్తున్న ప్రయాణీకుల్లో పాజిటివ్ వచ్చిన వారి నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తోంది. ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించిన కరోనా పాజిటివ్ శాంపిళ్లలో 10,787 శాంపిళ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. 771 కొత్త రకాల కరోనా వైరస్ (COVID-19 India strain) ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ కరోనా రకాల్లోని 736 శాంపిళ్లలో బ్రిటన్ రకం కరోనా ఉందని నిర్ధారించినట్టు పేర్కొంది.

ఇంకో 34 శాంపిళ్లలో దక్షిణాఫ్రికా రకం (South African lineage) ఉన్నట్టు తేల్చింది. ఇంకో శాంపిల్ లో బ్రెజిల్ రకం (Brazilian lineage) ఉందని పేర్కొంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా (New Covid strain India) ఆనవాళ్లున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటికి అదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు గుర్తించింది.

కరోనా వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? ఇతర మందులు వాడేవారు తీసుకోవచ్చా, తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది, డాక్టర్లు ఏమంటున్నారు ఓ సారి తెలుసుకోండి

కరోనా వైరస్ జన్యు క్రమ నిర్ధారణపై ఏర్పాటు చేసిన భారత సార్స్ కొవ్2 కన్సార్టియం ఈ కరోనా జన్యు క్రమాలను విశ్లేషించిందని వెల్లడించింది. వేరియంట్లు ఉండడం సర్వసాధారణమని, ప్రతి దేశంలోనూ వాటి ఆనవాళ్లుంటాయని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జన్యు క్రమ విశ్లేషణ చేసిన శాంపిళ్లన్నీ అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించినవని, దేశంలోని వివిధ కమ్యూనిటీల నుంచి తీసుకున్నవేనని పేర్కొంది.

మహారాష్ట్రలోని శాంపిళ్లను పరిశీలించగా ఈ484క్యూ, ఎల్452ఆర్ జన్యు పరివర్తనలు కలిగిన డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్టు ది ఇండియన్సార్స్ కోవ్-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ తో పోలిస్తే ఇప్పుడు అవి ఎక్కువయ్యాయని తెలిపింది. ఇలాంటి మ్యుటెంట్ కరోనాలు రోగ నిరోధక వ్యవస్థకు దొరక్కుండా తప్పించుకుంటాయని వెల్లడించింది. ఈ రెండు మ్యుటేషన్లు దాదాపు 20 శాతం శాంపిళ్లలో ఉన్నాయని చెప్పింది.

కేరళలోని 14 జిల్లాల నుంచి 2,032 శాంపిళ్లను పరిశీలించగా ఎన్440కే వేరియంట్ ఉన్నట్టు తేలిందని ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 11 జిల్లాల్లోని 123 శాంపిళ్లను పరిశీలించగా.. ఈ వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ ను దాటుకుని మనగలిగిందని వెల్లడించింది.

గాలిలో తిష్ట వేసిన కరోనావైరస్, కోవిడ్‌ వార్డుల్లోని గాలిలో వైరస్‌ ఆనవాళ్లను కనుగొన్న సీసీఎంబీ, వైరస్‌ కొంత కాలమైనా గాల్లో ఉండగలదని తెలిపిన సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా

ఇంతకుముందు తెలంగాణలోని 104 శాంపిళ్లకుగానూ 53 శాంపిళ్లు, ఏపీలో 33 శాతం శాంపిళ్లలో ఈ వేరియంట్ ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. బ్రిటన్, డెన్మార్క్, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా వంటి 16 దేశాల్లోనూ ఈ వేరియంట్ మూలాలున్నాయని చెప్పింది. ప్రస్తుతం ఈ డబుల్ మ్యుటెంట్ కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయా? అన్న దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. మార్చి 18 నాటికి 400కు పైగా ఉన్న కొత్త రకం కరోనా కేసులు గడిచిన ఐదురోజుల వ్యవధిలోనే రెట్టింపయ్యాయి.