New Delhi, May 12: దేశంలో మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా ప్రభావం వల్ల పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ (ICMR Chief Dr Balram Bhargava) మాట్లాడుతూ.. సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది యువత దాని బారిన పడుతున్నారు. అందుకు కారణం యువత నిర్లక్ష్యంగా ఉండడమే. కోవిడ్ నిబంధనల్ని పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యువత పెద్ద సంఖ్యలో గుమిగూడడం ఓ కారణమని తెలిపారు.
అయితే కొవిడ్ -19 (Covid 19) మొదటి వేవ్, రెండో వేవ్ కేసుల్ని పరీక్షించగా పెద్దగా వయస్సు వ్యత్యాసం లేదన‍్నారు. 40 ఏళ్లు పైబడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే 2020లో మొదటి వేవ్‌లో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 31 శాతం మంది ఉన్నారు. 2021లో ఈ శాతం 32కి చేరుకుందని కేంద్రం మార్చిలో తెలిపింది.
కాగా, కర్నాటక, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టగా.. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, చత్తీస్ గఢ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో పాటు 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు.
కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించనప్పటికీ మెజారిటీ రాష్ట్రాలు లాక్ డౌన్‌లోకి (Coronavirus lockdown) వెళ్లిపోయాయి. ఇప్పుడు దాదాపు దేశమంతా లాక్ డౌన్ మాదిరిగా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కరోనా కేసుల్లో మహారాష్ట్రను మించిపోయింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. పాజిటీవ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం ఫలితం కనిపించడంలేదు.
దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. లాక్ డౌన్ విధింపుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడంతో రాష్ట్రాలే ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తుండగా ఆ జాబితాలో తాజాగా తెలంగాణ కూడా చేరిపోయింది. 10 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో బలహీనంగా కనిపిస్తున్నా.. 13 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. ఆరు రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష వరకు యాక్టివ్ కేసులుండగా.. 17 రాష్ట్రాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్, హరియానా, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో లక్షకుపైగా యాక్టివ్ కేసులున్నాయని, ఈ 13 రాష్ట్రాల జాబితాలో 5,93,150 యాక్టివ్ కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. 1,05,104 కేసులతో బీహార్ చివరి స్థానంలో ఉందన్నారు. దాదాపు 26 రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 15శాతానికిపైగా ఉందని, ఆరు రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకు యాక్టివ్ కేసులు, 17 రాష్ట్రాల్లో 50వేల కన్న తక్కువ యాక్టివ్ కేసులు ఉన్నాయని లవ్ అగర్వాల్ తెలిపారు