Visakhapatnam Crane Crash | (Photo Twitter)

Vishakhapatnam, August 1:  ఇటీవల కాలంగా విశాఖపట్నంను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. శనివారం హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (హెచ్‌ఎస్‌ఎల్) ప్రాంగణంలో ఒక భారీ క్రేన్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 10 మంది మరణించారు, మరికొంత మందికి గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్‌ ఉద్యోగులు కాగా మిగిలిన వారు కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి చెందినవారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ తెలిపారు.

హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఇటీవలే ఈ భారీ క్రేన్ ను కొనుగోలు చేసింది. దీన్ని పూర్తి స్థాయి ఆపరేషన్‌లోకి తీసుకురావడానికి ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఓ పక్కకు ఒరుగుతూ కుప్పకూలింది. పదుల సంఖ్యలో కార్మికులు పనిలో నిమగ్నమయిఉన్నారు. దీంతో ఈ హఠాత్పరిణామాన్ని వారు అంచనా వేయలేకపోయారు. .అయితే ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది వెంటనే అప్రమత్తమయి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Visuals of the incident: 

ప్రమాదంపై సీఎం జగన్ ఆరా..

కాగా, ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమయ్యే తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై యాజమాన్యంతో చర్చించి వివరాలను సేకరించాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.