New delhi, November 8: తుఫానులు వరుసగా విరుచుకుపడుతున్నాయి. మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్... బంగాళాఖాతంలో ‘బుల్‌బుల్’ తుఫాను (Cyclone Bulbul) కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇది శనివారం ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి, ఆ తర్వాత ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్(West Bengal), బంగ్లాదేశ్ (Bangladesh) తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. వాయువ్య దిశగా మెల్లగా కదులుతున్న తుపాన్ ఈ నెల 10వ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) అంచనావేసింది.
వాతావరణ శాఖ హెచ్చరిక
India Meteorological Department: Severe Cyclonic Storm #Bulbul intensified into Very Severe Cyclonic Storm at 0530 hours today, centred about 530 km S-SW of Sagar Islands. To cross West Bengal & Bangladesh coast across Sundarbans Delta during early hours of 10th November pic.twitter.com/5r9t0OHHgr
— ANI (@ANI) November 8, 2019
తెలంగాణా రాష్ట్రం(Telangana)లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం పొడి వాతావరణం ఏర్పడవచ్చని వాతావరణ అధికారులు చెప్పారు. అక్టోబర్ నెలలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 63 శాతం అధికంగా వర్షాలు నమోదయ్యాయి. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడం, అల్పపీడనాలు, ఉపతల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో మంచి వర్షపాతం నమోదైంది.
గత కొన్ని రోజులుగా ఎగువన వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రధాన నదులకు వరదలు పోటెత్తింది. వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకుంటున్న సమయంలో బుల్ బుల్ రూపంలో ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో తుఫానుగా, నవంబర్ 9వ తేదీ వరకు తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో బుల్ బుల్ ప్రభావం అధికంగా ఉందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ బుల్ బుల్ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ‘బుల్ బుల్’ తుఫానుతో ఏపీలోని అన్ని పోర్టుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లద్దని అధికారులు హెచ్చరించారు.
ఈ తుపాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నప్పటికీ, ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. ఉదయం 8 గంటల సమయంలోనూ సూర్యుడు కనిపించని పరిస్థితి. ప్రస్తుతం బుల్ బుల్ అండమాన్ కు సమీపంలోనే ఉందని, దీని ప్రభావంతో ఇప్పటికే తీర ప్రాంత రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీని ప్రభావం మరో 72 గంటల వరకూ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, బెంగాల్ తీరంలో గంటకు 100 కిలోమీటర్ల వరకూ వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపారు. శనివారం సాయంత్రం తరువాత పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఇది తీరాన్ని దాటవచ్చని అంచనా వేస్తున్నట్టు వెల్లడించింది. తుపాను తన దిశను మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇది ఒడిశా వైపు పయనిస్తే, చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తుందని హెచ్చరించింది.