Representational Purpose Only (Photo Credits: Wikimedia Commons)

Cyclone Fengal News Live Updates: ఫెంగల్ తుఫాను దక్షిణాది రాష్ట్రాల్లో పెను విధ్వంసం సృష్టించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాన్‌ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఇది బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం మంగళవారం సాయంత్రంతో తగ్గుముఖం పడుతుందని, అప్పటి వరకు దక్షిణ కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉత్తరాంధ్రలో ఒకటి, రెండుచోట్ల మోస్తరు వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.

తుపాను ప్రభావంతో సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పొట్టి శ్రీరా­ములు నెల్లూరు జిల్లా కసుమూరులో అత్యధికంగా 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆత్మకూరు, నెల్లూరు రూరల్, మర్రిపాడు, అనంతసాగరం మండలా­ల్లోను పలుచోట్ల భారీ వర్షాలుపడ్డాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె, రాజంపేట, బాపట్ల జిల్లా నిజాంపట్నం, తిరుపతి జిల్లా వాకాడు, పుత్తూరు మండలాల్లోనూ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోను అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. పలు గ్రామాల్లో ధాన్యం రాశులు తడిచిపోయాయి. పొలాల్లో వరి పనలు నీట మునిగాయి.

తమిళనాడులో ఫెంగల్ తుఫాను విధ్వంసం, రూ. 2వేల కోట్లు మధ్యంతర సాయం ప్రకటించాలని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ లేఖ, వచ్చే మూడు రోజుల పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుకు భారీ వర్ష సూచన

ఫెంగల్‌ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై సోమవారం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మొత్తం 53 మండలాల్లో తుపాను ప్రభావం ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 6,824 హెక్టార్ల మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, దీనికి అవసరమైన ఎన్యుమరేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వర్షం కారణంగా తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు.

తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతున్న తరుణంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి వాయుగుండంగా మారుతుందనీ, అయితే తుపానుగా బలపడుతుందా.. లేదా.. అనే దానిపై ఈ వారాంతంలో అంచనా వేయగలమని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందన్నారు.

దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 8వతేదీ వరకు తేలికపాటి నుం చి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపా రు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత తగ్గింది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుంది.