Representational Image (Photo Credits: PTI)

New Delhi, December 3: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో, ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను (Cyclone Jawad) కేంద్రీకృతమైంది. గంటకు 30 కి.మీ వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది.

రేపు ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు (Tropical Cyclonic Storm Likely To Hit South Odisha Coast) దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కన్నబాబు (Minister Kannababu) తెలిపారు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుంది. తీరానికి వచ్చేకొద్దీ దిశ మార్చుకుని పూరీ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఉత్తరకోస్తా తీరంలో 80 - 90 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు (IMD) తెలుపుతున్నారు.

ఈ కారణంగా సాయంత్రం నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ సూచించాయి. 5వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని కోరాయి.

మరో గండం..నేడు జవాద్ తుపానుగా మారనున్న వాయుగుండం, శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

ఇవాళ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. రేపు ఉదయం నుంచి 80-90కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.తుపానును ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలను అలర్ట్​గా ఉండాలని సూచించారు. సమయం గడుస్తున్న కొద్ది.. తుపాను తీరాన్ని తాకే ప్రాంతంపై స్పష్టత రానుంది. 24 ఎన్​డీఆర్​ఎఫ్​, 158 రాష్ట్ర అగ్నిమాపక సేవల బృందాలు, 33 ఓడీఆర్​ఏఎఫ్​ను ఆయా ప్రాంతాల్లో మోహరించారు.

భారీ వర్ష సూచన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటి పారుదల మార్గాలను తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుపాను సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు 11 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అదనంగా మరో 4 బృందాలను అందుబాటులో ఉంచామని కన్నబాబు తెలిపారు. గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఖుర్ధా డివిజన్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి.

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, మూడు రోజుల పాటు 95 రైళ్లు రద్దు, జవాద్ తుపాను నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తూర్పు కోస్తా రైల్వే

తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 55 ఎస్డీఆర్‌ఎఫ్‌ సభ్యులను సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు విశాఖ కలెక్టరేట్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. 0891-2590100, 0891-2590102, 0891-2750089, 0891-2750090, 0891-2560820 నంబర్లతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని.. సహాయం కోసం ఈ నంబర్లకు ఫోన్‌ చేయొచ్చని జిల్లా అధికారులు తెలిపారు.

జవాద్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని 11 మండలాల్లో తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తాగునీటి కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.