CM Jagan Review on Cyclone Michaung: కోస్తా తీరాన్ని వణికిస్తున్న మిచౌంగ్ తుపాను, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, అత్యవసర సాయం కింద నిధులు విడుదల
CM-YS-jagan-Review-Meeting

Michaung Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్‌)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.

4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–­మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలు­న్నాయి. మరోవైపు తుపా­ను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మిచౌంగ్ తుపాను అలర్ట్, ఏపీలో స్కూళ్లకు సెలవులు, గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నేడు తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

మిచౌంగ్ తుపాను నేపథ్యంలో సీఎం జగన్( ys jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో 8 జిల్లాలపై తుపాను(cyclone) తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న హెచ్చరికలతో ఆయా జిల్లాల కలెక్టర్లు(collectors) అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర సాయం కింద నిధులు విడుదల చేశారు. తిరుపతి జిల్లాకు ప్రత్యేక సాయంగా రూ.2కోట్లు విడుదల చేశారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు.. ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు.

దక్షిణ ఆంధ్ర కోస్తా దిశగా దూసుకొస్తున్న 'మిచాంగ్' తుపాను..డిసెంబర్ 3 నుంచి వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం

మిచౌంగ్ తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.

విద్యుత్, రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఎక్కడైనా రవాణాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, అక్కడ సరైన వసతులు కల్పించాలన్నారు. పునరావాస శిబిరాల్లో బాధితుల కోసం తాగునీరు, ఆహారం, పాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.

తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తుపాను సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు తుపాను ప్రభావం జిల్లాపై ఉంటుందన్నారు కలెక్టర్. 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రభావం పెరుగుతుందని, 4వ తేదీ సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, పంచాయితీ రాజ్, పౌర సరఫరాలు, తదితర విభాగాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 1077 కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమించామని వివరించారు. సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో.. సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ హరి నారాయణన్.

తుపాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో ఒక మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 140కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.