Cyclone Michaung Update: మిచౌంగ్ తుపాను అలర్ట్, ఏపీలో స్కూళ్లకు సెలవులు, గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతూ నేడు తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం
Cyclone Michaung (Photo Credit: IMD)

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారానికి తుపాను (మిచాంగ్‌)గా బలపడనుంది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ వేగం శనివారం రాత్రికి ఏడు కిలోమీటర్లకు తగ్గింది. తుపానుగా మారాక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరింత శక్తిని పుంజుకునే అవకాశముంది. ఈ తుపాను పుదుచ్చేరికి 440 కి.మీ., చెన్నైకి 420 కి.మీ., నెల్లూరుకు 520 కి.మీ., బాపట్లకు 620 కి.మీ., మచిలీపట్నానికి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఆదివారం రాత్రికి ఇది తుపానుగా మారే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 4వ తేదీకి ఇది దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు విస్తరించనుంది. ఆ తర్వాత దక్షిణాంధ్ర తీర ప్రాంతానికి సమాంతరంగా ప్రయాణిస్తూ 5వ తేదీ ఉదయం బాపట్ల–­మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం సమీపంలో తీరం దాటేందుకు ఎక్కువ అవకాశాలు­న్నాయి. మరోవైపు తుపా­ను తీరం దాటుతుందా.. లేకపోతే మచిలీపట్నం సమీపంలోనే తీరం వరకు వచ్చి మళ్లీ సముద్రంలోనే దిశ మార్చుకుంటుందా.. అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

దక్షిణ ఆంధ్ర కోస్తా దిశగా దూసుకొస్తున్న 'మిచాంగ్' తుపాను..డిసెంబర్ 3 నుంచి వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం

తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 80–90, గరిష్టంగా 100 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఆదివారం నుంచి ఆరో తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు నగరంలో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రహదారులు జలమయం అయ్యాయి. జిల్లాలోని మైపాడు బీచ్ లో అలలు ఎగసిపడుతున్నాయి. తుపాను నెల్లూరు జిల్లాకు అత్యంత చేరువగా వస్తుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఏపీకి మిచాంగ్‌ తుఫాను ముప్పు.. రేపట్నుంచి భారీ వర్షాలు

అటు, ప్రకాశం జిల్లాకు కూడా తుపాను ముప్పు ఉందని వాతావరణ సంస్థలు పేర్కొనడంతో, అధికారులు స్పందించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా ప్రకాశం జిల్లాలో సోమ, మంగళవారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లా వైపు మిచాంగ్‌ తుపాను దూసుకొస్తుందన్న ఐఎండి తుపాను హెచ్చరికల నేపథ్యంలో … 4వ తేదీ జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ సెలవు ప్రకటించారు.

అన్ని శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుపాను తీరం దాటే సమయంలో గాలి ఉద్ధృతంగా వీస్తుందని హెచ్చరించారు. గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు.ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు మంగళవారం వరకు వేటకు వెళ్లకూడదని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అంబేద్కర్‌ హెచ్చరించారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ఆదేశించారు. మిచౌంగ్ తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. తుపాను పరిస్థితులు నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభావిత జిల్లాల కలెక్టర్లు సర్వసన్నద్ధంగా ఉండాలన్నారు.

మిచౌంగ్‌ తుపాను నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 140కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.