New Delhi, Feb 5: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 6గంటలకు ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు 57.70 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదు కాగా.. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ రికార్డైంది.
ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్(ఈస్ట్), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈరోడ్ ఈస్ట్ ఎమ్మెల్యే ఈవీకేఎస్ ఇళంగోవన్ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఆప్ సుప్రీం న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఆయనపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ పోటీ పడుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై బీజేపీ ఢిల్లీ విభాగం చీఫ్ రమేష్ బిధూరి, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లంబా పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.మొత్తం 70 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. 699 మంది అభ్యర్థులు పోటీచేశారు.