ఢిల్లీలోని సాహిబాబాద్‌లో జరిగిన ఒక పెళ్లి నాటకీయ మలుపు తిరిగింది, వరుడు పదే పదే "వాష్‌రూమ్ బ్రేక్‌లు" చేయడం ఆశ్చర్యకరమైన ఆవిష్కరణకు దారితీసింది-అతను వేదిక వెనుక తన స్నేహితులతో రహస్యంగా మద్యం సేవిస్తున్నాడు. ఈ ఊహించని పరిణామంతో రెండు కుటుంబాలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. పెళ్లి వేడుకలో భాగంగా వధూవరులిద్దరూ వేదికపైకి వచ్చి ఒకరికొకరు పూలదండలు వేసుకున్నారు.
ఆ తర్వాత పెళ్లిపీటల మీద ఆసీనులపై పురోహితుడి సూచనల ప్రకారం పెళ్లి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లికొడుకు వాష్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగొచ్చి కాసేపటికి మళ్లీ వాష్‌రూమ్‌కు అని చెప్పి వెళ్లిపోయాడు. ప్రతీసారి అలాగే వెళ్తుండటంతో పెళ్లి కూతురుకు అనుమానం వచ్చింది.మాటిమాటికి వాష్‌రూమ్‌కు ఎందుకు వెళ్తున్నాడో కనిపెట్టాలంటూ తన కుటుంబీకులకు కనుసైగ చేసింది.
దాంతో పెళ్లికొడుకును ఫాలో అయినవారికి అతను చేసిన పని తెలుసుకుని ఖంగుతిన్నారు. వాష్‌రూమ్ పేరు చెప్పి పెళ్లి కొడుకు వేదిక వెనుకాల స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అతడిని తాను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. వరుడు మెడలో వేసిన పూలమాలను విసిరికొట్టింది. దాంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు కుటుంబాలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. పెళ్లి రద్దయిపోయింది.