New Delhi, November 19: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు (Covid Scare in Delhi) రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆమ్ ఆద్మీ సర్కారుపై మండిపడింది. గత 18 రోజుల నుంచి మరణాల సంఖ్య పెరుగుతుంటే.. ప్రభుత్వం ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టలేదని కోర్టు కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని (Arvind Kejriwal-Led AAP Govt) ప్రశ్నించింది. జస్టిస్ హిమా కోహ్లీ, సుబ్రమణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. కోవిడ్19 వేళ.. వివాహ వేడుకలకు 50 మంది కన్నా ఎక్కువ మందికి ఎలా అనుమతి కల్పిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కోర్టు జోక్యం చేసుకునే వరకు ఎందుకు వేచి చూడాలని ఆప్ సర్కాన్‌ను హైకోర్టు నిలదీసింది.
కాగా నవంబర్ ఒకటో తేదీ నుంచి వైరస్ కేసులు పెరుగుతున్నాయని తెలుసినా..ప్రజల్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు. ఇన్నాళ్లు ఎందుకు వేచి ఉన్నారు, ఈ సమయంలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా అని ధర్మాసనం కేజ్రీ సర్కార్‌ను ప్రశ్నించింది. కోవిడ్ నియంత్రణలో ఢిల్లీ సర్కార్ విఫలమైనట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. మరోవైపు ఇవాళ సీఎం కేజ్రీవాల్.. కరోనా కేసుల అంశంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వారిపై రూ.2 వేలు జరిమానా విధించనున్నారు. గతంలో రూ.500 ఉన్న ఫైన్‌ను ఏకంగా రెండు వేలకు పెంచేశారు.
కరోనా కలవరం నేపథ్యంలో ఇవాళ సీఎం కేజ్రీవాల్.. అఖిల పక్ష పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాస్క్ ధరించని వారికి రెండు వేలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. కేసులు పెరుగుతుంటే ఎలా మౌనంగా ఉండిపోయారని.. ఇవాళ హైకోర్టు కూడా కేజ్రీ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. దీంతో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొరడా ఝళపించింది.