False Allegation Of Impotence: భర్త నంపుసకుడంటే క్రూరత్వమే, అతని ఆత్మ విశ్వాసంతోపాటు మానసిక ఆరోగ్యంపై అది ప్రతికూల ప్రభావం చూపుతుంది, కీలక వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ హైకోర్టు
Delhi High Court (Photo Credits: IANS)

New Delhi, Nov 22: తన భర్త నపుంసకుడు నాకు అతనితో విడాకులు కావాలనుకునే భార్య విషయంలో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి నపుంసకుడంటూ భార్య తప్పుడు ఆరోపణ చేయడం క్రూరత్వమేనని (False Allegation Of Impotence) ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ చర్య అతని ఆత్మ విశ్వాసంతోపాటు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న వాదనతో ఏకీభవించింది.

ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో తనకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమైన భర్తపై ఓ భార్య అతడు నపుంసకుడు అంటూ ఫిర్యాదు చేసింది. దీంతో అతడికి కోర్టు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె ఆరోపణలు నిజం కాదని తేలడంతో విడాకులు మంజూరు చేసింది.

వివరాల్లో కెళితే.. ఢిల్లీకి చెందిన ఈ దంపతులకు 2012లో వివాహమైంది. ఆమెకు అది మొదటి వివాహం కాగా, అతనికి రెండో పెళ్లి. పెళ్లికి ముందునుంచే ఆమె మానసిక సమస్యలతో బాధపడుతోందనీ ఆ విషయం దాచి పెట్టారని భర్త ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీంతో భార్య..అతడు నపుంసకుడనీ, సంసారిక జీవితానికి పనికిరాడంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణపై న్యాయస్థానం వైద్య నిపుణుడితో పరీక్షలు చేయించి అసత్యమని గుర్తించింది. భర్త వినతి మేరకు హిందూ వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

మళ్లీ లాక్‌డౌన్ దిశగా కొన్ని దేశాలు, తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం, చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూతో కూడిన కొత్త నిబంధనలు, దేశంలో తాజాగా 45,209 మందికి కోవిడ్ పాజిటివ్

అయితే, అతనితో కలిసే ఉంటానని, విడాకుల తీర్పును రద్దు చేసి, వైవాహిక హక్కులను పునరుద్ధరించాలంటూ సదరు మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. శనివారం విచారణ జరిపిన జస్టిస్‌ మన్మోహన్, జస్టిస్‌ సంజీవ్‌ నరూలాల ధర్మాసనం..దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో ఎటువంటి లోపం లేదని పేర్కొంటూ ఆ మహిళ అప్పీల్‌ను కొట్టివేసింది.

ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేసి తీవ్ర వేదనను, బాధను కలుగజేసిన మహిళతో కలిసి ఉండటం ప్రమాదకరమని ఆ వ్యక్తి భావించడం సహేతుకమేనని తెలిపింది. వీరి వైవాహిక బంధం పునరుద్ధరించడానికి వీలులేనంతగా దెబ్బతిందని వ్యాఖ్యానించింది. అయితే ఆయన విడాకుల నోటీసుకు సహజంగా స్పందించి అటువంటి ఆరోపణలు చేశానని, దీనిని మన్నించి వైవాహిక హక్కులు పునరుద్దరించాలన్న మహిళ కోరగా ఆ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది.