New Delhi, June 5: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ‘అన్‌లాక్’ ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా నేడు లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు (More Relaxations) కల్పించింది. మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరవాలని నిర్ణయించింది. ప్రైవేటు ఆఫీసులు కూడా 50శాతం సిబ్బందితో నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇవి కాకుండా సాధారణ దుకాణాలను మాత్రం ప్రతి రోజూ తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చారు ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) నేడు కీలక ప్రకటన చేశారు.
మరిన్ని సడలింపులతో జూన్ 14 ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగిస్తున్నాం. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సరి-బేసి పద్ధతిలో తెరచుకుంటాయి. సగం దుకాణాలు ఒక రోజు.. మిగతా సగం మరుసటి రోజు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు ఆఫీసులు 50శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. అయితే మరి కొద్దిరోజులు వర్క్‌ఫ్రం హోం కొనసాగిస్తేనే మంచిది.
మెట్రో సేవలు 50శాతం (Metro Services to Resume at 50% Capacity) సామర్థ్యంతో నడుస్తాయి’’ అని కేజ్రీవాల్ వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పరిస్థితిని బట్టి రానున్న రోజుల్లో మరిన్ని సడలింపులు ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
మూడో దశను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 420 టన్నుల ఆక్సిజన్ స్టోరేజీ కెపాసిటీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా కొత్త వేరియంట్లను గుర్తించేందుకు రెండు జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ వివరించారు.