Air Travel: దేశీయ విమాన సర్వీసుల సామర్థ్యం 65 శాతానికి పెంపు; హైదరాబాద్ విమానాశ్రయంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ, జూన్ నెలలో 4.35 లక్షల మంది ప్రయాణం
Flight | Representational Image | (File Photo)

Hyderabad, July 6: దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను సడలించడంతో, దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది, ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలకు తగినట్లు దేశీయంగా విమాన సర్వీసులు కూడా పెరిగాయి. సెకండ్ వేవ్ కరోనాలో కేసులు ఒక్కసారిగా పెరగడంతో విమాన సర్వీసులను సగానికి తగ్గించారు, అయితే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండటంతో ఇప్పుడు 15 శాతం అదనంగా సర్వీసులను పెంచారు. 65 శాతానికి డొమెస్టిక్ ప్రయాణాలకు విమాన సర్వీసులను పెంచుతున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది, జూలై 31 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది.

ఇక, 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారిని మరియు వ్యాక్సినేషన్ చేసుకున్న వారిని దేశంలోని పలు రాష్ట్రాలు మరియు ఇతర దేశాలకు అనుమతి లభిస్తుండటంతో దేశీయంగా, అంతర్జాతీయ ప్రయాణాలు పెరుగుతున్నాయి.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత జూన్ నుండి ప్రయాణీకుల రద్దీ పెరగటం ప్రారంభించింది. జూన్ నెలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 4 లక్షల మంది దేశీయ ప్రయాణాలు మరియు 35,000 మంది అంతర్జాతీయ ప్రయాణాలు సాగించారు.

వ్యాక్సిన్ పంపిణీ పురోగతితో పాటు సడలించిన ప్రయాణ ఆంక్షలు, క్వారైంటైన్ ప్రోటోకాల్స్ పాటించడం, తప్పనిసరిగా ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు చేయించుకోవడం వంటి నిబంధనలకు కట్టుబడుతుండటంతో ప్రయాణికులు విమానయానంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని అలాగే ఎలాంటి ఆందోళన లేకుండా తమ ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నారని ఎయిర్ పోర్ట్ అథారిటీ అధికారులు చెబుతున్నారు.

దేశీయంగా హైదరాబాద్ నుంచి దిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, వైజాగ్ నగరాలకు గత నెలలో అత్యధిక ప్రయాణాలు జరిగాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ముంబై నగరానికి మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ప్రయాణికుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని అధికారులు చెబుతున్నారు. మే నెలలో హైదరాబాద్ టూ ముంబై 12 వేల మంది ప్రయాణించగా, జూన్ నెలలో 22 వేల మంది ప్రయాణించారు. ఈ రూట్ లో 84 శాతం వృద్ధి కనిపించిందని అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే, ఇప్పటికీ దేశంలో ఇంకా 13 నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కాలేదు, జూలై తర్వాత పరిస్థితులను బట్టి ప్రారంభించే అవకాశం ఉంది.