New York, Jan 21: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కొత్తగా "గల్ఫ్ ఆఫ్ అమెరికా"గా పేరు మార్చడానికి ఒక ఆర్డర్ ఉంది.ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని తెలిపారు. అందుకే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశామని తెలిపారు.
ట్రంప్ జనవరిలో మార్ ఎ లాగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వేళ తొలిసారి ఈ విషయాన్ని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ ప్రదేశాలను మాదక ద్రవ్యాల ముఠాలు నియంత్రిస్తున్నాయని తాను అధికారం లోకి రాగానే అమెరికా సరిహద్దులను బలోపేతం చేస్తానని వెల్లడించారు.
ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జల వనరుగా పరిగణింపబడుతున్న గల్ఫ్ ఆఫ్ మెక్సికో దాదాపు ఉత్తర అమెరికాలో దాదాపు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్రాన్ని కలిగి ఉంది. మౌత్ ఆఫ్ రియో గ్రాండ్ అనే ప్రదేశంలో అమెరికా, మెక్సికోల మధ్య దీని సరిహద్దులు మొదలవుతాయి. అమెరికా ఆర్థికవ్యవస్థకు ఈ ప్రదేశం అత్యంత కీలకమైంది. ఈ ప్రదేశంలో అమెరికాలో వినియోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమెరికాలో వినియోగించే 40 శాతం మత్స్య సంపద ఇక్కడే దొరుకుతుంది. అయితే ట్రంప్ ప్రతిపాదనలను మెక్సికో తొలి నుంచి వ్యతిరేకిస్తోంది.
దీంతో పాటు గ్రీన్‌ల్యాండ్‌ను కూడా అమెరికా అధినేత కొనుగోలు చేయనున్నారు. ఈ కొనుగోలు విషయంలో తమతో పాటు డెన్మార్క్ కూడా కలిసి వస్తుందని అమెరికా నమ్ముతోంది. ఇప్పటికే ట్రంప్ బృందం ఒకసారి గ్రీన్‌ల్యాండ్‌కు వెళ్లి చర్చలు కూడా జరిపింది. అంతర్జాతీయ భద్రత కోసం ఇది అమెరికా అధీనంలో ఉండటం చాలా అవసరం అని ట్రంప్ తెలిపారు.