File Image of FM Nirmala Sitharaman (Photo Credits: ANI)

New Delhi, April 14: దేశవ్యాప‍్తంగా కరోనా వైరస్‌ రెండవ దశలో తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లాక్‌డౌన్ అంశాలపై (India Lockdown Row) కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 విస్తరణను అడ్డుకునే చర్యల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి లాక్‌డౌన్ విధించబోదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించమని, స్థానికంగానే నియంత్రణా చర్యల్ని చేపడతామని ఆమె వెల్లడించారు.

గతేడాది లాక్‌డౌన్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని..ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. రెండవ దశలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టడం తమకిష్టంలేదని (Don't want to arrest economy) ఆమె పేర్కొన్నారు. కరోనా కట్టడికి ఆయా కంటైన్‌మెంట్ జోన్లలో కఠిన చర్యలపై మాత్రమే ఆధారపడతాన్నారు. ఆయా రాష్ట్రాల కోవిడ్‌ సమాచారాన్ని సేకరించామని, చర్యలు బావున్నాయని ఆర్థికమంత్రి (Union Finance Minister Nirmala Sitharaman) సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్‌పాస్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలతో పాటు ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్ ప్రభావాల గురించి మాట్లాడారు. కరోనా సెకండ్‌వేవ్‌లో కూడా, భారీ లాక్‌డౌన్‌ దిశగా తాము పోవడంలేదన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, కరోనా నిబంధనలు లాంటి ఐదు స్థంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామన్నారు. వైరస్‌ బారిన పడిన వారి హోం క్వారంటైన్ చేస్తామని ఆమె తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అలాగే భారతదేశానికి ఆర్థిక లభ్యతను, రుణ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రపంచ బ్యాంక్ చేపట్టిన చర్యలను సీతారామన్ ప్రశంసించారు.

కరోనాని కంట్రోల్ చేయలేకపోతున్న లాక్‌డౌన్, నైట్ కర్ప్యూలు, దేశంలో 24 గంట‌ల్లో ఏకంగా 1,84,372 కేసులు న‌మోద‌ు, 1027 మంది మృతితో 1,72,085కు చేరుకున్న మరణాల సంఖ్య

కాగా దేశంలో రికార్డు కేసులతో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రెండు లక్షలకు చేరువలో ఉన్న కరోనా పాజిటివ్‌ కేసులు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ‍్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని, రాష్ట్రాలే కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష‍్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాలు ఈ మేరకు రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

గడచిన 24 గంటలలో 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1027 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,38,73,825కు చేరినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేసులుండగా... కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 1,72,085 మంది మృతి చెందారు. కాగా చికిత్స నుంచి కోలుకుని 1,23,36,036 మంది బాధితులు డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 26,46,528 మంది కరోనా వాక్సిన్ తీసుకున్నారు.