
ముంబై, మార్చి 3: కేరళలోని కలంజూర్ గ్రామంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితుడిని వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేశాడు. నిందితుడిని 32 ఏళ్ల బైజుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై (Double Murder in Kerala) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలంజూరు గ్రామంలో బైజు (30), వైష్ణవి (28) అనే భార్యాభర్తలు తమ పదేళ్ల, ఐదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే విష్ణు (30) అనే వ్యక్తి తల్లితో కలిసి ఉంటున్నాడు.
రోజూ బైజుతో కలిసి విష్ణు పనికి వెళ్లేవాడు. రెండు కుటుంబాలు కలుపుగోలుగా ఉండేవి. ఈ క్రమంలో ఇటీవల వైష్ణవి ఫోన్‌కు విష్ణు ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో విష్ణు కిస్ ఎమోజీని పంపించాడు. దీంతో ఆగ్రహించిన బైజు ఇంట్లో ఉన్న కొడవలి తీసుకుని భార్యపై దాడికి ప్రయత్నించాడు. భయంతో ఆమె పక్కనే ఉన్న విష్ణు ఇంట్లోకి పారిపోయింది. అయినా విడిచిపెట్టకుండా భార్యను వెంబడించిన బైజు ఆమెను బయటికి రావాలని ఆగ్రహంతో హెచ్చరించాడు. భయంతో ఆమె బయటకు రాకపోవడంతో బైజూనే ఇంట్లోకి చొరబడి ఆమె కొడవలితో దాడి చేశాడు.
అడ్డుకోబోయిన విష్ణుపై కూడా కొడవలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.అనంతంరం ఆస్పత్రికి తరలించగా ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దాడి అనంతరం బైజు తన ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి హత్యల విషయం తెలిపాడు. బైజు స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.