Hyderabad Married Woman Found Dead Under Mysterious Circumstances, Family Alleges Murder

Hyd, Mar 3: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.శిరీషది సహజ మరణం కాదని పోస్టుమారం నివేదిక ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఊపిరాడకుండా చేసి హత్య (Hyderabad Woman Murder Case) చేసినట్లుగా పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు. భర్త వినయ్‌నే దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రి వద్ద వినయ్‌, అతని ఇద్దరు అక్కలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అనుమానాస్పద మృతి కేసును మర్డర్ కేసుగా మార్చారు చాదర్ ఘాట్ పోలీసులు.శిరీష మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు పోలీసులు. శిరీషను ఎందుకు చంపాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా పరకాలకు చెందిన విజయలక్ష్మి చిన్న కూతురు శిరీష(32)కు నాగర్ కర్నూలు జిల్లా దోమల పెంటకు చెందిన వినయ్‌తో ఆరేండ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరు ముగ్గురు అక్కా చెల్లెళ్లు కాగా.. తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో కరీంనగర్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌ శిరీషను దత్తత తీసుకున్నారు. ఈ క్రమంలోనే నర్సింగ్‌ పూర్తి చేసిన శిరీష.. ఆ తర్వాత వినయ్‌తో ప్రేమలో పడింది. తమ మాట వినకపోవడంతో ప్రొఫెసర్‌ కుటుంబం ఆమెను దూరం పెట్టింది. 2016లో వినయ్‌ని వివాహం చేసుకోగా 2019లో పాప పుట్టింది.ఆ పాపకు ఇప్పుడు రెండేళ్లు.

మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

ప్రస్తుతం వీరి కుటుంబం మలక్‌పేటలోని జమునా టవర్స్‌లో నివాసం ఉంటున్నారు.ఆదివారం రాత్రి శిరీషకు ఛాతిలో నొప్పి వచ్చిందని చెప్పి సమీపంలోని మెట్రో క్యూర్‌ హాస్పిటల్‌కు వినయ్‌ తరలించారు. అక్కడ శిరీషను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిదని నిర్ధారించారు. దీంతో శిరీష కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని తమ స్వగ్రామం దోమలపెంటకు తరలించేందుకు సిద్ధమయ్యాడు.

ఈ విషయం తెలిసిన శిరీష మేనమామ మధుకర్‌ వినయ్‌కు కాల్‌ చేసి తాము వచ్చేవరకు మృతదేహాన్ని హాస్పిటల్‌లోనే ఉంచాలని సూచించాడు. కానీ వినయ్‌ పట్టించుకోకుండా శిరీష మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని స్వగ్రామానికి బయల్దేరాడు. ఆగ్రహించిన మేనమామ మధుకర్‌.. అంబులెన్స్‌ డ్రైవర్‌ తెలుసుకుని అతనికి ఫోన్‌ చేశాడు. దీంతో అంబులెన్స్‌ డ్రైవర్‌ చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వాళ్లు అంబులెన్స్‌ను తీసుకుని వెనక్కి రావాలవని సూచించారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెబుతున్నారని.. శిరీష భర్త గుండెపోటు కథ అల్లాడని చాదర్ ఘాట్ పోలీసులకు శిరీష కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శిరీష బంధువుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అంత్యక్రియలు ఎర్రగడ్డలోని శ్మశానవాటికలో పూర్తి చేయనున్నారు. అనంతరం శిరీష భర్త వినయ్‌, అతని ఇద్దరు అక్కలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా రెండు రోజుల క్రితం కూడా శిరీష తన అక్కకు ఫోన్‌ చేసి ఇంటికి వచ్చేస్తానని, వినయ్‌ కుటుంబ సభ్యులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు చెప్పిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.